క్రెడిట్ కార్డు ఎఫెక్ట్.. పిల్లల్ని అమ్మేసి, ఫోన్ కొనుక్కుని..
జూదానికి భర్త భానిసై అప్పులు చేయడంతో వాటిని తీర్చేందుకు ఓ మహిళ తన కన్న బిడ్డలను అమ్ముకుంది. రెండు వారాలు కూడా నిండని కవల పిల్లలను అమ్మి దానితో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించి మిగతా సొమ్ముతో మొబైల్ కొనుగోలు చేసింది. ఈ ఘటన ఏడాది క్రితం చైనాలో చోటు చేసుకోగా.. తాజాగా అక్కడి పోలీసులు ఈ వివరాలను బయటపెట్టారు.
జెజియాంగ్ రాష్ట్రంలోని సిక్సి ప్రాంతానికి చెందిన ‘మా’ అనే మహిళ తన భర్త చేసిన అప్పులు తీర్చేందుకు గత ఏడాది సెప్టెంబర్‌లొ ఈ పనిచేసింది.ఆ బిడ్డలను 65 వేల యువాన్ (రూ. 6,54,300),ఒకరిని 45 వేల యువాన్(రూ.4,52,977) వేర్వేరు వ్యక్తులకు అమ్మేసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో గొడవ కాస్తా పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చిన్నారుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. కొన్నవారి అడ్రస్ మా తీసుకోకపోవడంతో ఏడాది తర్వాత కేసు కొలిక్కి వచ్చింది.
చిన్నారులను ‘మా’ తల్లిదండ్రులకు అప్పగించగా.. దంపతులు ఇంకా జైలులోనే ఉన్నారు. చైనా చట్టాల ప్రకారం.. చిన్నారులను అక్రమంగా తరలించడాన్ని నేరం కాబట్టి దోషులకు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పిల్లలను విక్రయించిన తల్లిదండ్రులకు కూడా శిక్షవిధిస్తారు. ఈ ఘటనపై కోర్టు త్వరలోనే తీర్పు వెల్లడించనుంది.