పుచ్చకాయలిచ్చి కొత్త అపార్టుమెంట్లు కొంటున్నారు... - MicTv.in - Telugu News
mictv telugu

పుచ్చకాయలిచ్చి కొత్త అపార్టుమెంట్లు కొంటున్నారు…

July 5, 2022

తాజా పుచ్చకాయలకు సరికొత్త ఇళ్లను బేరానికి పెట్టింది.. చైనాలోని నాన్‌జింగ్‌కు చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌ సంస్థ. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వ రంగ పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ తెలిపింది. రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు గోధుమలు, అల్లం ఇతర వ్యవసాయోత్పత్తుల రూపంలో చెల్లింపులు స్వీకరిస్తూ ఇళ్లను విక్రయిస్తున్నారని వెల్లడించింది. ఇదంతా రైతులు ఇళ్లు కొనేలా ప్రోత్సహించేందుకు చేస్తున్నట్లు తెలిపింది. ఒక్క పుచ్చకాయలే కాదు.. గోధమలు, వెల్లుల్లి రూపంలో చెల్లింపులు చేయాలని ఆఫర్లు ఇస్తున్నారు. అయినా ఇళ్ల కొనుగోలుకు అక్కడి ప్రజలు ముందుకు రావడం లేదు.

ఎందుకిలా?
వరుస కోవిడ్‌ లాక్‌డౌన్లు, ఉక్రెయిన్‌-రష్యా యుద్దంతో ఎన్నో దేశాలతో పాటు ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనాలో కూడా ఆర్థిక సంక్షోభం రోజు రోజుకు తీవ్రమవుతోంది. అక్కడి పారిశ్రామిక, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో తీవ్ర సంక్షోభం నెలకొంది. సెంట్రల్‌ చైనాలోని హెనిన్ ప్రావిన్స్‌లో రియల్‌ ఎస్టేట్‌ కుప్పకూలింది. ఆహారం, చమురు, గ్యాస్‌ దిగుమతులు నిలిచిపోవడంతో పేద, ధనిక దేశాలు అన్న తేడా లేకుండా సంక్షోభం దిశగా పయనిస్తున్నాయి. నిత్యావసరాలు, ఇంధనం, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు.

ఆరేళ్లలో తొలిసారి గత సెప్టెంబర్‌ నుంచి ఇళ్ల ధరల్లో పతనం మొదలైంది. ఫలితంగా ముందస్తుగానే నిర్మాణాలకు చెల్లింపులు చేసిన వినియోగదారులు నష్టపోయే పరిస్థితి వచ్చింది. దీంతో కొనుగోలుదారులు ఓ పట్టాన ముందుకు రావడంలేదు. చైనాలోని నగరవాసుల సంపద 70శాతం గృహాలపై పెట్టుబడుల్లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ సంస్థలను ఆదుకొనేందుకు కేంద్ర బ్యాంక్‌ రంగంలోకి దిగింది. భవిష్యత్తులో షీజిన్‌పింగ్‌ మూడోసారి అధికారం చేపట్టనున్న సమయంలో కమ్యూనిస్టు పార్టీకి ఇది పెనుసవాలుగా మారింది.