Chinese twin sisters betrayed the government 30 times
mictv telugu

ప్రభుత్వాన్ని 30 సార్లు మోసం చేసిన చైనీస్ ట్విన్ సిస్టర్స్.. టెక్నాలజీపై అనుమానం?

June 30, 2022

కమ్యూనిస్టు చైనాలో నియంతృత్వం నడుస్తోందన్న విషయం తెలిసిందే. అక్కడి పౌరులపై ప్రభుత్వం నిరంతర నిఘా వేసి ఉంటుంది. టెక్నాలజీ పరంగా అమెరికాను ఢీకొట్టే స్థాయికి చైనా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు చైనా కవల సోదరీమణులు చేసిన పనికి అక్కడి అధికార యంత్రాంగం షాక్‌కు గురయింది. వివరాల్లోకెళితే.. ఉత్తర చైనా నగరమైన హార్బిన్‌కు చెందిన ఇద్దరు కవల సోదరీమణులు హాంగ్, వీల ముఖ కవళికలు ఒకేలా ఉంటాయి. అయితే హాంగ్ జపనీస్ యువకుడితో ప్రేమలో పడి అతడిని పెళ్లి చేసుకుంది. తర్వాత అత్తగారింటికి వెళ్లాలి కాబట్టి భర్తతో కలిసి జపాన్ వెళ్లాలనుకుంది. అయితే పలు కారణాల వల్ల వీసా రద్దు కావడంతో మరో ప్లాన్ వేసింది. తన సోదరి అయిన వీ పాస్‌పోర్టుతో జపాన్, ఆ తర్వాత రష్యా, చైనాల మధ్య కనీసం 30 సార్లు ప్రయాణించింది. అటు వీ కూడా హాంగ్ పాస్ పోర్టుతో నాలుగు సార్లు థాయ్‌లాండ్ వెళ్లి వచ్చింది. అయితే ఎట్టకేలకు విషయం ఇమ్మిగ్రేషన్ అధికారులకు తెలియడంతో వారు ఆశ్చర్యపోయారు. మే నెలలో చైనాకు వచ్చిన వీరిని పోలీసులు అరెస్టు చేయగా, పై తతంగం అంతా బయటపడింది.

ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నా ఇంత పెద్ద పొరపాటు ఎలా జరిగిందని అక్కడి పోలీసులు, అధికారులు తలలు పట్టుకున్నారు. ముఖకవళికలు ఒకేలా ఉన్నా, వేలి ముద్రలు వేరుగా ఉంటాయి కాబట్టి ఆ విషయంలోనైనా ఎలా పసిగట్టలేకపోయారని పౌరులు ప్రశ్నిస్తున్నారు. 140 కోట్ల మంది జనాభా ఉన్న చైనాలో ప్రభుత్వం ప్రతి పౌరుడి కదలికలపై నిఘా వేసి ఉంటుంది. కేవలం ఒక్క సెకను వ్యవధిలో జరిగే తేడాలను గుర్తించగలిగే సాంకేతికత ఉన్న ఈ రోజుల్లో కవలలు చేసిన పని కనిపెట్టలేకపోవడం అన్నది చైనాలో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇదిలా ఉండగా, ఈ సంఘటనతో చైనా టెక్నాలజీ మీద అనుమానాలు రావడం మొదలయ్యాయి. దీంతో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ తల దించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.