టిక్‌టాక్ స్టార్‌ను సజీవదహనం చేసిన మాజీ భర్త    - MicTv.in - Telugu News
mictv telugu

టిక్‌టాక్ స్టార్‌ను సజీవదహనం చేసిన మాజీ భర్త   

October 2, 2020

Chinese vlogger incident after ‘set on fire by ex-husband during live stream’.

ఆమె చేస్తున్న టిక్‌టాక్ వీడియోలను చూసి ఓర్వలేకపోయిన ఓ మాజీ భర్త ఆమెను లైవ్‌లోనే పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఈ దారుణ ఘటన చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. సిచువాన్‌లోని ఓ గ్రామానికి చెందిన 30 ఏళ్ల లాము అనే మహిళ టిక్‌టాక్‌లో బాగా పాపులర్ అయింది. అయితే ఆమె భర్తతో విడిపోయి తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది. చైనీస్ టిక్‌టాక్ వెర్షన్‌ ‘డోయిన్’ (Douyin)లో ఆమె వీడియోలు చేస్తూ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆమె వీడియోలు పెద్దఎత్తున వైరల్ కావడంతో ఆమెకు పేరు బాగా వచ్చింది. దీంతో డోయిన్‌లో లాముకు 7.82 లక్షల ఫాలోవర్లు ఉండగా, ఆమె వీడియోలకు ఇప్పటివరకు 63 లక్షల మంది లైక్ చేశారు. అలా ఆమె తనదైన ప్రపంచంలో బతుకుతోంది. సెప్టెంబరు 14న ఇంట్లో ఉన్న లాము డోయిన్‌లో లైవ్ చేస్తోంది. ఆ సమయంలో ఆమె మాజీ భర్త ఇంటికి వచ్చాడు. పెద్ద కత్తితో తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. చూస్తుండగానే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను లాముపై పోసి నిప్పటించాడు. 

ఆ దృశ్యాలు డోయిన్‌లో లైవ్‌లో ప్రసారమయ్యాయి. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. మంటల్లో కాలిపోవడంతో లాముకు తీవ్ర గాయాలయ్యాయి. అరుపులు విన్న స్థానికులు ఆమెను వెంటనే సిచువాన్ పబ్లిక్ ఆసుపత్రికి తరలించారు. 90 శాతం కాలిన గాయాలు కావడంతో 15 రోజుల పాటు ప్రాణాలతో పోరాడి సెప్టెంబరు 30న ఆమె మరణించింది. ఈ ఘటన సిచువాన్ ప్రావిన్స్‌లో తీవ్ర కలకలం రేపింది. నిందితుడిని కూడా చంపేయాలని ఆమె అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన రోజే లాము మాజీ భర్తను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరోవైపు లాము హత్యపై చైనీస్ సోషల్ మీడియా వీబోలో నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చించారు. ఆమె పేరుతో హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. దాదాపు 7 కోట్ల మంది లాము గురించి పోస్టులు పెట్టినట్లు చైనీస్ మీడియా తెలిపింది.  కాగా, లాముది పేద కుటుంబం. వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేకపోవడంతో సాయం చేయాల్సిందిగా ఆమె అభిమానులను కోరారు. దీంతో అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కేవలం 24 గంటల్లోనే 10 లక్షల యువాన్లు (దాదాపు కోటి రూపాయలు) విరాళంగా అందించారు.