సోషల్ మీడియా వచ్చాక లైక్స్ కోసం ఏది పడితే అది చేసెయ్యడం ఫ్యాషన్‌గా మారింది. ముందూ వెనకా చూసుకోకుండా స్పెషల్ ఫీట్లు చేయడం, లైక్స్ వస్తే పొంగిపోవడం, రాకపోతే డిప్రెషన్‌కు గురవడం మామూలైపోయింది. చైనాకు చెందిన ఓ యువ బ్లాగర్ లైక్స్ సంగతి పక్కన పెడితే చాలా కష్టంలో పడిపోయింది. సొరచేప కూర తిన్నందుకు ప్రభుత్వం ఆమెకు రూ. 15 లక్షల భారీ జరిమానా విధించింది.
ఫుడ్ బ్లాగింగ్ వీడియోలు పెట్టే జిన్ మౌమౌ అమ్మడి కష్టం ఇది. టీజీ పేరుతో వీడియోలు చేసే మౌమౌ గత ఏడాది గొప్పకు పోయి ఆన్‌లైన్‌లో గ్రేట్ వైట్ షార్క్ జాతికి చెందిన ఆరు అడుగుల చేపను రూ.93 వేలకు కొనుక్కుంది. అది అంతరించిపోతున్న అరుదైన జాతి చేప. మౌమౌ గుట్టుచప్పుడు కాకుండా కూర వండుకుని తినకుండా అతి చేసింది. చేప పక్కన పడుకుని, కూర్చుని నానా భంగిమల్లో ఫొటోలు, వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టింది. కోసి, కారం పెట్టి వండుతున్న వీడియోలను కూడా షేర్ చేసింది. అది అసలే చైనా. అధికారులు సీరియస్ అయ్యారు. దర్యాప్తు చేసి ఆమెను దోషిగా తేల్చి రూ.15 లక్షల జరిమానా విధించారు. కథ అంతటితో ముగియలేదు. చేపను పట్టుకున్న జాలరిని, అమ్మిన వ్యాపారిని కూడా కటకటాల్లోకి నెట్టారు.