ఫోన్ కొనివ్వలేదని బాయ్‌ఫ్రెండ్‌కు 52 చెంపదెబ్బలు (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

ఫోన్ కొనివ్వలేదని బాయ్‌ఫ్రెండ్‌కు 52 చెంపదెబ్బలు (వీడియో)

May 25, 2019

ప్రేమికుల మధ్య అప్పుడప్పుడు గిల్లికజ్జాలు ఉండాల్సిందే. లేకపోతే ప్రేమాయణం బోరు కొడుతుంది. కానీ అలకలు, కోపాలు హద్దుమీరితే అసలుకే మోసం వస్తుంది. చిన్నచిన్న విషయాలను పెద్దవి చేసుకుని విడిపోయిన జంటలు చాలా ఉన్నాయి చరిత్రలో. ఓకే, సోది వదిలేసి ఇక నేరుగా విషయంలో వద్దాం.

బాయ్‌ఫ్రెండ్ తన మొబైల్ ఫోన్ కొనివ్వలేదని గర్ల్ ఫ్రెండ్ పట్టపగలు అందరూ చూస్తుండగా అతని చెంపలు చెంపలు వాయించింది. ఒక దెబ్బ కాదు, రెండు దెబ్బలు కాదు, ఏకంగా 52 దెబ్బలతో అతని ముఖం ఎర్రగా వాచిపోయింది. దెబ్బలే కాదు, బండబూతులు కూడా తిట్టేసింది. చుట్టుపక్కల వారు వారిస్తున్నా వినకుండా ఆ ప్రియురాలు కాళికలా మారిపోయింది. చైనాలోని సిచువాన్ నగరంలో ఈ దారుణం జరిగింది. అది కూడా చైనీయుల లవర్స్ డే అయిన మే 20నే నమోదైంది. ఆమె అంత వాచిపోయేలా కొడుతున్నా అతడు కిక్కురుమనకుండా కొట్టించుకున్నాడు ఎదురు తిరిగి ఒక దెబ్బ కూడా వేయలేదు. చివరికి అక్కడున్న పోలీసులు ఆమె ధాష్టీకాన్ని అడ్డుకున్నారు. ఆమెను పోలీస్ స్టేషన్‌‌కు తీసుకుపోతుండగా, సదరు వీరప్రేమికుడు ఆవేశంతో అడ్డుకోవడం కొసమెరుపు.

చెంపదెబ్బలు, తిట్లు తమకు సంబంధించిన విషయమని, ఇందులో పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అతడు కరాఖండీగా అన్నాడు. దీంతో పోలీసులు బిక్కమొగం వేశారు. తర్వాత ఇద్దరినీ ఒక చోట కూర్చోబెట్టి విషయం ఆరా తీశారు. ఇద్దరికీ కొన్నాళ్లుగా గొడవలు ఉన్నాయని, అతనికి ఆమె డబ్బు సాయం చేస్తోందని తేలింది. లవర్స్ డే కానుక కొనిస్తానని చెప్పిన అతడు మాట నిలబెట్టుకోకపోవడంతో ఆమె దురాగతానికి పాల్పడినట్లు వెల్లడించింది. ఆమె కోపం చల్లారేవరకు నోరుమూసుకుని కొట్టించుకోవాలని అతడు అనుకున్నాడట. జీవితంలో ఇలాంటివన్నీ మామూలేనని, సహనం, ఓర్పు ఉండాలని పోలీసులు అమ్మాయికి నచ్చజెప్పారు.