Chinese woman, who robbed bank of Rs 4.77 crore and got plastic surgery, caught after 25 years
mictv telugu

కోట్లు కొల్లగొట్టిన బ్యాంక్ ఉద్యోగిని.. ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జరీ..

January 24, 2023

Chinese woman, who robbed bank of Rs 4.77 crore and got plastic surgery, caught after 25 years

క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్ సినిమాల స్టోరీలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఓ బ్యాంకు ఉద్యోగిని వేసిన స్కెచ్ చూస్తే షాకవ్వక మానరు. మనీ హైస్ట్ లాంటి హాలీవుడ్ సినిమాలో కూడా లేని విధంగా ఎన్నో ట్విస్టులు రియల్ లైఫ్ జరిగాయంటే అంత ఈజీగా నమ్మరు. పాతికేళ్ల క్రితం చైనాలో జరిగిన ఓ చోరీ కేసులో.. నిందితురాలు తాజాగా అరెస్ట్ అయింది. తాను పనిచేస్తున్న బ్యాంకుకే కోట్లాది రూపాయలు మేర కన్నం వేసింది సదరు మహిళ. ఆ తర్వాత ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుని..మరో ప్రాంతానికి పారిపోయి.. కొత్త జీవితాన్ని ప్రారంభించింది. పెళ్లి చేసుకుంది. వ్యాపారవేత్తగా కూడా ఎదిగింది. కానీ, చేసిన పాపం ఊరికే పోతుందా.. 25 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కింది.

చైనాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 1997లో చెన్ వైల్ అనే మహిళ యెకింగ్ నగరంలో చైనా కన్ స్ట్రక్షన్ బ్యాంకులో క్లర్కుగా పనిచేసేది. బ్యాంకు గుట్టుమట్లన్నీ గుర్తించిన ఆమె… ఓ లోపాన్ని ఆధారంగా చేసుకుని, తన ఖాతాలో లేని సొమ్మును ఉన్నట్టుగా సాంకేతిక మార్పులు చేసింది. తన ఖాతాలో భారీమొత్తం జమ అయినట్టుగా ఎడిట్ చేసింది. బ్యాంకు ఖాతాల నుంచి తన ఖాతాలో 3.98 మిలియన్ యువాన్‌లను అంటే రూ. 4.77 కోట్లు మళ్లించింది.. నగరంలోని వివిధ బ్యాంకు శాఖల నుండి తన ఖాతాకు సొమ్మును మళ్లించింది. ఆ తర్వాత తన ఖాతా నుంచి డబ్బును డ్రా చేసుకుంది. వెంటనే ఆసుపత్రికి వెళ్లి ప్లాస్టిక్ సర్జరీతో కొత్త రూపాన్ని పొందింది.

ఇక, ఆ తర్వాత ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చి, 1.43 మిలియన్ యువాన్లను (రూ. 1.71 కోట్లు) బిల్డింగ్ చుట్టూ, బహిరంగ టాయిలెట్‌తో సహా వివిధ ప్రాంతాల్లో దాచింది. ఆ తర్వాత ప్రావిన్స్‌కి వెళ్లి 2.1 మిలియన్ యువాన్‌లను (రూ. 2.52 కోట్లు) ముగ్గురు తోబుట్టువులు కొత్తగా సృష్టించిన జాయింట్ బ్యాంక్ ఖాతాల్లోకి పెట్టారు. అయితే, ఆమె తల్లిదండ్రులు దీనికి ఒప్పుకోలేదు.. తిరిగి వచ్చి, తన నేరాన్ని అంగీకరించమని ఒత్తిడి తెచ్చారు.. కానీ, అదనపు డబ్బును బ్యాంక్‌ నుంచి విత్‌డ్రా చేసుకోవడానికి పాస్‌బుక్‌లను వారికి అందజేసింది వెళ్లిపోయింది.. తన మొదటి భర్తను సొంత ఊరిలోనే వదిలి.. ప్రావిన్స్ నుండి షాంఘైకి పారిపోయింది.

అక్కడ జియాంగ్ పేరుతో కొత్త ఐడీ కార్డును క్రియేట్ చేసి, పేరు మార్చుకోవడమే కాకుండా, పెళ్లి కూడా చేసుకుని ఓ అమ్మాయికి జన్మనిచ్చింది. ఆమెకు గతంలో ఓసారి పెళ్లయినా, ఆ విషయాలేవీ చెప్పకుండా, కొత్త రూపురేఖలతో రెండో పెళ్లి చేసుకుంది. కాలక్రమంలో ఆమె వ్యాపారవేత్తగా ఎదిగింది. అయితే, పోలీసులు 1997 నుంచి ఆమె కోసం వెతుకుతూనే ఉన్నారు. పాతికేళ్ల దర్యాప్తు తర్వాత వారి కృషి ఫలించి ఆమె పాపం పండింది. ఆమెపై పలు అభియోగాలతో కేసులు నమోదు చేశారు.