'యాదాద్రి' నుంచి చినజీయర్‌ను తప్పించాలి: రేవంత్ - MicTv.in - Telugu News
mictv telugu

‘యాదాద్రి’ నుంచి చినజీయర్‌ను తప్పించాలి: రేవంత్

March 18, 2022

fbfcb

చినజీయర్ స్వామి వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో పెద్ద ఎత్తున్న ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవలే సమ్మక్క, సారలమ్మలపై చినజీయర్ చేసిన వ్యాఖ్య‌లు భక్తుల మనోభావాలను దెబ్బతీసెలా ఉండడంతో పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చినజీయర్ స్వామిపై మండిప‌డ్డారు. అంతేకాకుండా ఆదివాసీలు తమ ఇంట్లో ఉన్న చినజీయర్ స్వామి ఫోటోలను తీసి, వాటిని దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం చినజీయర్ స్వామి వ్యాఖ్యలపై స్పందించారు. ట్వీట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి స్పందిస్తూ….”తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీకలైన “సమ్మక్క సారలమ్మ”లను అవమానపరిచిన త్రిదండి చినజీయర్‌ని యాదగిరిగుట్ట ఆగమశాస్త్ర సలహాదారుడి బాధ్యతల నుండి తక్షణమే కేసీఆర్ తొలగించాలి. మన భక్తి విశ్వాసాలపై దాడి చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి” అంటూ ఆయన ట్వీట్ చేశారు.

మరోపక్క వరంగల్‌, మహబూబాబాద్‌, ములుగు జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రెండు రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోనూ ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. సమ్మక్క, సారలమ్మపై చిన‌జీయ‌ర్ స్వామి చేసిన‌ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని అమ్మ‌వార్ల భ‌క్తులు డిమాండ్ చేస్తున్నారు. అప్ప‌టి వ‌ర‌కు త‌మ ఆందోళ‌న‌లు కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.