కేసీఆర్‌కు, చిన్న జీయర్‌కు మధ్య గ్యాప్? అవును, ఇదే సాక్ష్యం! - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్‌కు, చిన్న జీయర్‌కు మధ్య గ్యాప్? అవును, ఇదే సాక్ష్యం!

March 16, 2022

kcr

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. రాజకీయాలకే కాదు, ‘భక్తికీయాల’కు కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆయన పాదాభివందనం చేసే వైష్ణవ గురువు చిన్న జీయర్‌ జగమెరిగిన మిత్రులు. ఇప్పుడు వారిద్దరి మధ్య బాగా దూరం పెరిగింది! ప్రతిష్టాత్మక ‘సమతామూర్తి’ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జీయర్ కేసీఆర్‌ను పిలవకపోవడం, అక్కడి ఫలకంపై ఆయన పేరు గల్లంతు కావడం దీనికి ఉదాహరణ. తర్వాత ఏమైందో ఏమోగాని ఫలకంపై కేసీఆర్ పేరు చేరింది. పేర్ల గొడవ పక్కన పెడితే విగ్రహావిష్కరణ కోసం హైదరాబాద్ వచ్చిన మోదీకి కేసీఆర్ దూరదూరంగా మెలగడం, జీయర్ మోదీకి అతి దగ్గరదగ్గరా మసలడం చూస్తుంటే, స్వాములవారికి, ముఖ్యమంత్రుల వారికి మధ్య విభేధాలు బాగా ముదిరాయని తాజా పరిస్థితులు చెబుతున్నాయి.

‘సమ్మక్క సారక్కలు దేవతలు కాదం’టూ చిన్న జీయర్ పదేళ్ల కిందట చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రేగుతున్న వివాదం వీరి విభేదాలను మరింత స్పష్టంగా ఎత్తి చూపుతోంది. టీఆర్ఎస్ అధికార స్వరంగా పేరొందిన టీన్యూస్ టీవీ చానల్‌ సోషల్ మీడియాలో ఉంచిన వీడియో దీనికి ఊతమిస్తోంది. ‘సమ్మక్క, సారక్క’ వ్యాఖ్యలకు జీయర్ క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఘాటుగా మాట్లాడిన వీడియో అది. జీయర్‌కు ‘భక్తాగ్రేసరుడైన’ కేసీఆర్ తాలూకు చానల్ వేదికపై ఈ వీడియో కనిపించడం యాదృచ్ఛికమని భావించడానికి లేదు. ఉద్దేశపూర్వకంగా సీతక్క వీడియోను పోస్ట్ చేసినట్లు కనిపిస్తోందని పరిశీలకుల అంచనా.

ఈ వీడియోను కొంతసేటి తర్వాత డిలీట్ చేయడం ఇందులో అందరికీ అర్థమయ్యే ట్విస్ట్. జీయర్ తనకు దూరం జరగడమే కాకుండా, తను నిత్యం తిట్టిపోస్తున్న ప్రధాని మోదీకి దగ్గర కావడం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని భావిస్తున్నారు. ’సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి మోదీకన్నా అర్హులు దేశంలో లేరని’ జీయర్ చేసిన వ్యాఖ్యలు మోదీని తీవ్రంగా విమర్శిస్తున్న కేసీఆర్‌కు సహజంగానే జీర్ణమయ్యేవి కావు. కేసీఆర్‌తో తనకెలాంటి విభేదాలూ లేవని జీయర్ వివరణ ఇచ్చినా విభేదాలు తొలగిపోలేదని తాజా పరిస్థితి చెబుతోంది.

చిన్న జీయర్‌కు బీజేపీ, సంఘ్ పరివారం దగ్గరవుతుండడం గులాబీ దళపతికి ఇష్టం లేనట్టు కనిపిస్తోంది. జీయర్‌ తన ప్రచార అవసరాల కోసం హిందూ శక్తులకు దూరంగా ఉండే పరిస్థితి కూడా లేదు. మతం పేరుతో మోదీ దేశంలో సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారని, తెలంగాణకు ఆయన బద్ధశత్రువు అని కేసీఆర్ సందర్భం వచ్చినప్పుడల్లా దుయ్యబడుతున్నారు. అలాంటి మోదీతో జీయర్ సాన్నిహిత్యం సహజంగానే కోపం తెప్పించేదే. తన రాష్ట్రంలో ఆశ్రమం కట్టుకుని, తన అనుచర వర్గంలోని మైహోమ్ రామేశ్వరరావు అండతో పైకెదిగిన జీయర్… ’ఏరు దాటేదాక ఓడ మల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య’గా వ్యవహరిస్తుండాన్ని కేసీఆర్ ఎలా అర్థం చేసుకోగలరో అందరూ ఊహించేదే. యాదాద్రిఃలో ముందుంది…

చిన జీయర్ సలహా ప్రకారం కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ప్రారంభం విషయంలో వీరు ఎలా వ్యవహరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సమ్మక్క, సారక్కలపై వివక్షపూరిత వ్యాఖ్యలు చేసిన జీయర్‌ను యాదాద్రి కార్యక్రమాకు పిలవొద్దని ఇప్పటికే కొందరు తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు.