గుంటూరు వాసికి అరుదైన గౌరవం.. - MicTv.in - Telugu News
mictv telugu

గుంటూరు వాసికి అరుదైన గౌరవం..

February 20, 2020

cvfbvcbn

గుంటూరు వాసికి అరుదైన గౌరవం దక్కనుంది. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డు) చైర్మన్‌ పదవికి బ్రాహ్మణకోడూరుకు చెందిన చింతల గోవిందరాజులు నియమితులుకానున్నారు. ఈ పదవికి ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల నుంచి 18 మంది పేర్లు బోర్డు పరిశీలించింది. చివరికి గోవిందరాజులు పేరును సిఫారసు చేస్తూ బ్యాంక్స్‌ బోర్డు బ్యూరో నిర్ణయం తీసుకుంది. 

24 ఏళ్ల తరువాత ఓ తెలుగు వ్యక్తికి ఈ గౌరవం దక్కనుండడం గమనార్హం. 24 ఏళ్ల క్రితం కోటయ్య నాబార్డు సంస్థకు చైర్మన్‌గా వ్యవహరించారు. చింతల గోవిందరాజులు ప్రస్తుతం నాబార్డు డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హోదాలో ఉన్నారు. ఆయన తొలుత ఢిల్లీలోని ఐఏఆర్‌ఐలో సీడ్‌ టెక్నాలజీ విభాగంలో పీజీ చేశారు. 1985లో నాబార్డులో నేరుగా గ్రేడ్‌-బి అధికారిగా చేరారు. గడిచిన 35 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. లఖ్‌నవూలోని బీఐఆర్‌డీ డైరెక్టర్‌గా, న్యాబ్‌ఫిన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ఆయన పాఠశాల, కళాశాల విద్య గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాలలో, జేకేసీ కళాశాలలో అభ్యసించారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ పూర్తిచేశారు.