కళ్లు లేని వృద్ధుడు.. మోటార్లను మహా బాగా రిపేర్ చేస్తాడు
ఆరేళ్ల వయసులో చూపు కోల్పోయాడు. తండ్రి చిన్నప్పుడు నేర్పించిన ఈతలో ప్రావీణ్యం సంపాదించాడు. కంటిచూపు లేకున్నా వ్యవసాయ మోటార్ల మరమ్మతులపై పట్టు సాధించాడు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపురం గ్రామానికి చెందిన చింతం రాజయ్య విశేషాలివి. చూపు లేకున్నా 62 ఏళ్ల వయసులో కూడా నీటి బావుల్లోకి దిగి పాడైన మోటార్లను బయటికి తీయడం, వాటికి మరమ్మతులు చేయడం.. తనవంట తాను చేసుకోవడం.. ఇలా ఒకరిపై ఆధారపడకుండా జీవిస్తున్నాడు.
వారసత్వంగా వచ్చిన పెంకుటింట్లో ఉంటున్న చింతం రాజయ్య.. తల్లిదండ్రులు చనిపోయాక కొన్నాళ్లు ఆయనను పెద్దన్నయ్య చేరదీసి అన్నం పెట్టారు. ఆయన కూడా చనిపోవడంతో.. ఎవరిపైనా ఆధారపడొద్దని నిర్ణయించుకుని గ్యాస్ పొయ్యి మీద వంట చేయడం నేర్చుకున్నారు. ఇంట్లో కాలక్షేపం కోసం ఓ టీవీ పెట్టుకున్నారు. బొమ్మ కనిపించకున్నా ఎవరు ఏమిటో చెప్పగలరు. హీరో నాగార్జున సినిమాలంటే ఇష్టమని చెబుతారు రాజయ్య. కాళ్లకు చెప్పుల్లేకపోతే ఊరిలో దారుల్ని సులువుగా గుర్తించగలనని వివరించారు. పొలాల్లోని బావుల దగ్గరకు ఎవరి సాయం లేకుండానే వెళ్లి వస్తారు.