కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసిన తర్వాత చాలా కాలం పాటు రెస్టారెంట్లు, హోటళ్లు అన్ని మూతబడిపోయాయి. కొన్ని నెలల పాటు ఎవరికీ రెస్టారెంట్ వెళ్లే అవకాశం దక్కలేదు. కానీ ఉడుతలకు మాత్రం అద్భుతమైన అవకాశం ఏర్పడింది. వాటి కోసం ఓ మహిళ చిన్నపాటి రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసింది. ప్రతి రోజూ ఆ రెస్టారెంట్‌కు ఉడుతలు వచ్చి భోజనం చేసి వెళ్తూ ఉన్నాయి. వాటికి కావాల్సిన ఆహారం తినేసి సరదాగా గడుపుతున్నాయి. జార్జియాలోని ఏంజెలా హన్స్ బెర్గర్ అనే మహిళ చేసిన ఈ ప్రయత్నం అందరిని ఆకట్టుకుంటోంది.
అట్లాంటాకు చెందిన ఏంజెలా ఫుడ్ రైటర్‌గా పని చేస్తూ ఉంటోంది. రెస్టారెంట్లకు వెళ్లి, అక్కడ భోజనం చేసి దానికి రేటింగ్ ఇస్తూ.. రివ్యూలు రాస్తూ ఉంటుంది. అయితే కరోనా ఎంట్రీతో ఆమె ఉపాధికి గండిపడింది. రాస్టారెంట్లు అన్ని మూసేయడంతో రైటింగ్ ఆగిపోయింది. ఖాళీ సమయాల్లో ఏం చెయ్యాలో తెలియక టెన్షన్ పడిపోయారు. తనకే అలా ఉంటే చిన్నపాటి జీవుల పరిస్థితి ఏంటని ఆలోచించింది. అప్పుడే తన ఇంటి ఆవరణలో తిరుగుతున్న చిప్మంక్ జాతికి చెందిన ఉడుతలు కనిపించాయి. వాటికి ఏదైనా చేయాలనే ఆలోచన చేసింది. వెంటనే సరదాగా ఓ రెస్టారెంట్ నిర్మాణం చేపట్టింది.
ఒకరోజు ఆమెకు తన మామయ్య.. ఓ చిన్న చెక్క పిక్ నిక్ టేబుల్‌ను పంపారు. దాన్ని ఉడుతల కోసం ఉపయోగించింది. వెంటనే తన ఇంటి ముందున్న గార్డెన్లో పెట్టింది. దానిపై ఉడుతలకు సరిపోయేలా చిన్న చిన్నపాటి ప్లేట్లు, సాసర్లూ పెట్టి వాటిని వాల్‌నట్స్‌తో నింపింది.
అవి చూడగానే ఓ ఉడుత వచ్చి మొత్తం వాల్ నట్స్ తినేసి వెళ్లిపోయింది. మరుసటి రోజు కూడా అలాగే వచ్చింది. దీంతో ఏప్రిల్ నుంచి వాటికి కావాల్సిన ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చేస్తూనే ఉంది. రకరకాల గింజలు పెడుతూ రోజుకో రకంగా రెస్టారెంట్‌ను తీర్చి దిద్దేది. బర్త్ డే సెటప్, చిన్నపాటి గుడారం, పిక్నిక్ టేబుల్ ఇలా కొత్త కొత్త పద్దతులతో అలంకరించేది. అలా అనేక ఆర్టికల్స్ రాస్తూ తన ఫాలోవర్లను పెంచుకుంది. ఈ రెస్టారెంట్ సెటప్ వల్ల తనకు ఉపాధితో పాటు ఆనందం కూడా దక్కడంతో ఉడుతల రెస్టారెంట్ గురించి రోజుకో విషయాన్ని ఆర్టికల్ రూపంలో రాస్తోంది.