అయోధ్యను మించిన సీతమ్మ భవ్యమందిరం నిర్మిస్తాం - MicTv.in - Telugu News
mictv telugu

అయోధ్యను మించిన సీతమ్మ భవ్యమందిరం నిర్మిస్తాం

October 25, 2020

Chirag Paswan wants temple 'bigger than Ram Mandir' in Sitamarhi for Goddess Sita

నేతల వాగ్దానాలతో బీహార్ ఎన్నికలు కాక పుట్టిస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వివిధ పార్టీ నేతలు హామీల వర్షం కురిపిస్తున్నారు. మొన్నటికి మొన్న బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో బీహార్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే కరోనా టీకాను ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. తాజాగా మరో పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్యలో రామ మందిరానికి  మించిన సీతామాత భవ్య మందిరాన్ని నిర్మిస్తామని లోక్ జన్‌శక్తి పార్టీ (ఎల్‌జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ వెల్లడించారు. సీతామాత లేకుండా రాముడు సంపూర్ణుడు కాలేడని.. అలాగే రాముడు లేకుండా సీతమ్మకు సంపూర్ణత్వం ఉండదని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అయోధ్యలోని రామాలయాన్ని, సీతామర్హిని కలుపుతూ ఒక కారిడార్ నిర్మాణం జరగాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సీతామర్హిలోని పునౌరా థామ్‌లో చిరాగ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఎలాంటి సందేహం లేకుండా బీహార్‌లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ‘బీహార్‌లో మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా సీతామాత ఆలయానికి శంకుస్థాపన చేస్తాం. ప్రస్తుత ముఖ్యమంత్రి తిరిగి ముఖ్యమంత్రి కాకుంటే బీజేపీ నాయకత్వంలో మేము బీజేపీ-ఎల్‌జేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అని చిరాగ్ తెలిపారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయం తరహాలో.. సీతామర్హిలో సీతామందిరం నిర్మిస్తామని ఎల్‌జేపీ ఇటీవలే విడుదల చేసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల విజన్ డాక్యుమెంట్ ‘బీహార్ ఫస్ట్ బీహార్ ఫస్ట్’లో కూడా పేర్కొంది. సీతామర్హి నుంచి అయోధ్యను కలిపే ఆరు లేన్ల రోడ్ కారిడార్ నిర్మిస్తామని హామీ ఇచ్చింది.