వీరసింహారెడ్డి దూకుడు.. వీరయ్య వెనుకంజ.. మొదలైన యుద్ధం - MicTv.in - Telugu News
mictv telugu

వీరసింహారెడ్డి దూకుడు.. వీరయ్య వెనుకంజ.. మొదలైన యుద్ధం

November 25, 2022

సంక్రాంతి బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు ఇండస్ట్రీ దిగ్గజాలు ఇద్దరు రెడీ అయిపోయారు. వీరసింహారెడ్డిగా గర్జించడానికి బాలకృష్ణ సన్నద్ధమవుతుంటే.. వాల్తేరు వీరయ్యగా రికార్డుల వేటకి చిరంజీవి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా వీరయ్య, వీరసింహారెడ్డిలు పోటీపడి మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు. బాస్ పార్టీ అంటూ పెప్పి బీట్ ని నిన్న మెగాస్టార్ వదిలితే.. నేడు జై బాలయ్య అంటూ మాస్ సాంగ్ ని రిలీజ్ చేశాడు బాలకృష్ణ. ఇండస్ట్రీలో హీట్ పుట్టించే చిరంజీవి, బాలకృష్ణల పోరు అంటే ఎప్పుడూ ఆసక్తే. వీరిద్దరి ఫైట్ ఈనాటిది కాదు. కొన్ని దశాబ్దాలుగా బాక్సాఫీస్ పై వీరి ఆధిపత్యం నడుస్తూనే ఉంది. అయితే చాన్నాళ్లకు సంక్రాతి పండగ నాడు బాలయ్య, చిరంజీవిల సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే గతంలో చాలాసార్లు ఇద్దరి సినిమాలు ఒకేసారి విడుదలైన బ్లాక్ బస్టర్స్ అయిన సందర్భాలు ఉన్నాయి.. ఒకరిని మించి ఒకరి సినిమాలు విజయం సాధించిన విశేషాలు ఉన్నాయి. ఈ క్రమంలో మళ్లీ బాలయ్య, చిరంజీవిల సినిమాలు వస్తున్నాయని తెలిసేసరికి ఫ్యాన్స్ లో ఎక్సయిట్ మెంట్ మామూలుగా లేదు. ఎవరి టీజర్ కి వ్యూస్ ఎక్కువ, ఎవరి ట్రైలర్ బాగుంది, ఎవరి సాంగ్ కి క్రేజ్ దక్కుతుంది వంటి లెక్కలన్నీ ఫ్యాన్స్ వేస్తూనే ఉంటారు.

ఈ క్రమంలో తాజాగా విడుదలైన జై బాలయ్య సాంగ్ కి బాస్ పార్టీ పాట కంటే కాస్త ఇంపాక్ట్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. చిరంజీవి బాస్ పార్టీ యువతకి నచ్చితే.. ఊరమాస్ ఏమో బాలయ్య సాంగ్ కి జై కొడుతున్నారు. చిరు సాంగ్ ని దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేస్తే.. తమన్ జైబాలయ్య పాటకి ట్యూన్ ఇచ్చాడు. సహజంగానే దేవిశ్రీ, తమన్ మధ్య కూడా పోటీ గట్టిగానే ఉంటుంది. నువ్వానేనా అన్నట్టు వీరిద్దరి మ్యూజిక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో హై బీట్ తమన్ మ్యూజిక్ లోనే కనిపించిందని.. బాస్ పార్టీ సాంగ్ ని మాస్ కి నచ్చేలా దేవిశ్రీ కంపోజ్ చేయలేపోయాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. అయితే తమన్ జై బాలయ్య సాంగ్ కంటే బాస్ పార్టీ సాంగ్ కి లాంగ్ రన్ ఎక్కువ ఉంటుందని కూడా అంటున్నారు. దేవిశ్రీ సాంగ్స్ స్లో పాయిజన్ లా ఎక్కుతాయని.. విడుదలైన వారానికి కానీ దేవిశ్రీ ట్యూన్స్ జనాలకు కనెక్ట్ అవ్వవని.. తాత్కాలికంగా జైబాలయ్య సాంగ్ దూకుడు కనిపించినా.. మునుముందు బాస్ పార్టీ సాంగ్ అన్ని రికార్డులని చెరిపేస్తుందని మెగా ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలలో ఏది ఎక్కువ కలెక్షన్స్ రాబడుతుందనే పాయింట్ కూడా ప్రస్తుతం ఆసక్తిరేపుతోంది. సంక్రాంతి టైమ్ లో రికార్డులు సృష్టించడం వీరిద్దరికి కొత్తేమి కాదు. అయితే.. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత.. మారిన ప్రేక్షకులు ఈ సినిమాలను చూసే విధానం పట్ల ఏది విజయం సాధిస్తుంది? అనేది ఇప్పుడు కొత్త విషయం.