ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకుండా సొంత కష్టంతో పైకొచ్చిన హీరోలు చిరంజీవి, రవితేజలు. ఒక్కోమెట్టు ఎక్కుతూ చిరంజీవి మెగాస్టార్ అయితే.. అన్ని పాత్రలు వేస్తూ మాస్ మహారాజాగా ఎదిగాడు రవితేజ. ప్రస్తుతం ఎంతోమంది యువ నటులకు వీరిద్దరే ఆదర్శం. అలాంటి చిరు, రవితేజలు వ్యక్తిగతంగానూ సొంత అన్నదమ్ముళ్లా ఉంటారు. రవితేజ ట్యాలెంట్ చూసి అతని కెరీర్ బిగినింగ్ లో మెగాస్టార్ చాలా సపోర్ట్ చేసేవాడని.. నటుడు కాకముందు నుండే చిరంజీవికి రవితేజ డై హార్డ్ ఫ్యాన్ అని అంటారు. అలాంటి వీరిద్దరూ చాలారోజులకి కలిసి చేసిన చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి సందర్భంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తుంది. దేవిశ్రీ మ్యూజిక్, మెగాస్టార్ కామెడీతో పాటు రవితేజ ఎపిసోడ్ సినిమాని నిలబెట్టిందని అంటున్నారు. సెకండ్ హాఫ్ లో మాస్ మహారాజ ఎంట్రీ తరువాత వీరయ్య గతి మారిందని.. క్లైమాక్స్ లో రవితేజ చనిపోయే సీన్ కంటతడి పెట్టించేలా ఉందని ప్రశంసలు వస్తున్నాయి. సరిగ్గా ఈ సెంటిమెంటల్ సీన్ లో నటించే సందర్భాన్ని గుర్తుచేసుకుని ఒకింత ఎమోషనల్ అయ్యారు చిరంజీవి.
వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ అయిన సందర్భంగా చిత్ర యూనిట్ నిన్న సక్సెస్ మీట్ ఏర్పాటు చేయగా.. చిరంజీవి, రవితేజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవితేజతో తన అనుబంధాన్ని చెప్తూ మెగాస్టార్ ఎమోషనల్ అయ్యాడు. చిరంజీవి మాట్లాడుతూ.. ‘కెమెరామెన్ ఆర్థర్ విల్సన్ నాతో ఒక మాట అన్నారు. రవితేజతో సెంటిమెంట్ సీన్ లో మీరు ఎక్కడా గ్లిజరిన్ పెట్టుకుని చేయలేదు. కానీ కళ్లలో నీళ్లు వచ్చాయి అని అడిగారు. దానికి నేను ఏం చెప్పానంటే.. ఎదురుగా ఉన్నది నా తమ్ముడండి.. వాడు నిస్సత్తువుగా ఉండి.. ఎక్స్పైర్ డేట్ వచ్చేసింది, బీడీ ఇవ్వరా అని అడుగుతుంటే కన్నీళ్లు వచ్చేశాయి అని చెప్పాను. వాడ్ని బతికించుకోవాలనే తాపత్రయాన్ని కడుపులో నింపుకున్నా అందుకే గ్లిజరిన్‌ని పెట్టుకోలేదు. కళ్లు తుడుచుకుంటూనే ఏడుస్తున్నా.. రవితేజని కొట్టాను కూడా. సరిపోలేదన్నా కొట్టు అంటాడు. కానీ కొట్టేందుకు నాకు మనసు రాలేదు. ఇద్దరి మధ్య ఆ ఎమోషన్ సీన్స్‌కి ఆర్థర్ విల్సన్ లాంటి చలించిపోయారు. ఆ పాత్రలో రవితేజ కాకుండా మరేవరైనా ఉండి ఉంటే? నాకు అలా కన్నీళ్లు వచ్చేవి కావు’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.