మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం సంక్రాంతికి విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు. ఇప్పటికే పలు విషయాలను వెల్లడించిన మెగాస్టార్.. గతంలో తనపై జరిగిన విష ప్రయోగంపై స్పందించారు. విష ప్రయోగం జరిగిన మాట వాస్తవమేనని అప్పట్లో ఏం జరిగిందో మొత్తం రివీల్ చేశారు. ‘మరణ మృదంగం సినిమా షూటింగ్ సమయంలో ఓ పిచ్చి ఫ్యాన్ చేసిన పని ఇది. ఫైట్స్ సీన్స్ చేస్తున్నప్పుడు నన్ను చూడడానికి చాలా మంది వచ్చారు. కొందరు అభిమానులు వచ్చి నన్ను కేక్ కట్ చేయమని అడిగారు చేశాను. ఒక వ్యక్తి కేక్ ముక్క కట్ చేసి బలవంతంగా తన చేత్తో నోట్లో పెట్టేశాడు. అయితే ఆ కేక్ కాస్త చేదుగా అనిపించింది. చూస్తే కేక్ లో ఏదో పౌడర్ మిక్స్ చేసినట్టు అనిపించింది. మావాళ్లు వాడిని పట్టుకుని అడిగితే ఏం లేదన్నాడు. కానీ ఆ కేక్ ని టెస్టులకు పంపిస్తే పాయిజన్ అని రిపోర్టు వచ్చింది. వెంటనే నిర్మాత కేఎస్ రామారావు గారు అతడిని కొట్టేశారు. ఎందుకిలా చేశావని అడిగితే.. ఈ మధ్య చిరంజీవి నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఆయనకు దగ్గరవ్వాలనే ఇలా చేశాను. కేరళ నుంచి తెచ్చిన వశీకరణ మందు తెచ్చి కేక్ లో కలిపానన్నాడు. దాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. విష ప్రయోగం అనే పెద్ద పదాలు వాడొద్దని చెప్పా. పాపం వాడిది అభిమానం అనుకోవాలో మూర్ఖత్వం అనుకోవాలో.. వాడు మాత్రం అభిమానంతోనే చేశాడు. అలాంటి వాడిని ఏం చేస్తామని నవ్వి ఊరుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.