Chiranjeevi shares his ‘First Day First Show’ experience
mictv telugu

‘ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు.. నన్ను రోడ్డు మీద ఉరికించి కొట్టారు’

September 1, 2022

మెగాస్టార్ చిరంజీవి బుధవారం ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్‌ అనుబంధ సంస్థ అయిన శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమా సెప్టెంబరు 2న విడుదల కానుంది. కాగా మెగాస్టార్ ఇప్పటివరకు ఎక్కడా, ఎవ్వరి ముందు చెప్పని ఒక సీక్రెట్ ను ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పంచుకున్నారు.

మీకు ఉన్న ఫస్ట్ డే ఫస్ట్ షో మూమెంట్ ను చెప్పమని యాంకర్ సుమ అడుగ్గా “ఈ విషయం నేను ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు. నాకు చెప్పుకోవాలి అని ఉన్నా పరువు పోతుందని చెప్పను. చిన్నతనంలో రామారావు గారు నటించిన రాము సినిమాకు స్నేహితులతో కలిసి వెళ్లాను. టికెట్స్ తీసుకోమని నన్ను పంపించి వాళ్లు వెళ్లిపోయారు. నాతో పాటు నాగబాబును తీసుకెళ్ళాను. అప్పటికీ అతను చాలా చిన్నవాడు. ఆ టికెట్స్ కోసం నిలబడి, కొట్టుకొంటున్నారు. అందులో నాగబాబును నలిపేశారు. ఇక ఏదో విధంగా టికెట్స్ తీసుకొని వెళ్ళడానికి బయలుదేరాం.

ట్విస్ట్ ఏంటంటే.. దానికి ముందు షో వదలగానే మా నాన్న గారు, వెనుక అమ్మ బయటికి వచ్చి మమ్మల్ని చూశారు. పాపం నాగబాబు బేలగా ముఖం పెట్టాడు. ఇక ఇంటికి వెళ్ళాక మా నాన్న కొబ్బరి మట్ట పట్టుకొని సినిమాకు ఎలా వచ్చావు అని అడిగారు. నేను .. మీరు , అమ్మ సినిమాకు వెళ్లారని తెలిసి వచ్చామని చెప్పాను. వెళ్తే వెళ్ళావ్ కానీ నేల టికెట్ తీసుకొని అక్కడ ఉంటే తమ్ముడును తొక్కేస్తే ఏంటీ పరిస్థితి అని అడిగారు. మా బంధువుల ఇళ్లన్నీ దాటుకొని ఉన్న వీధి వరకు నన్ను నాన్న ఉరికించి కొట్టారు. అది నా ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవం. అది ఇప్పుడు తలచుకొంటే సంతోషంగా ఉన్నా ఏవిఎం రాము అంటే చాలు వణుకు వచ్చేస్తోంది” అని చెప్పుకొచ్చారు.