అమ్మ... ఐలమ్మ అందుకొ మా జోహార్లు. - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మ… ఐలమ్మ అందుకొ మా జోహార్లు.

September 10, 2017

 

తెలంగాణ రైతాంగ సాయుధపోరాటంలో నిప్పురవ్వలా చాకలి ఐలమ్మ ఉద్యమించింది..అపర దుర్గలా దొరల దోపిడిని అడ్డుకుంది..పెత్తనాన్ని ధిక్కరించే పిడికిల్లకుస్పూర్తినిచ్చింది..రైతాంగ పోరాటం సాయుధ సమరంలా మారడంలో కీలక పాత్ర పోషించిన చాలకి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఇవే మా జోహార్లు.

ఆరాటానికి ఆవేశం తోడయితే పోరాటం పురుడు పోసుకుంటుంది…ఆధిపత్యాన్ని ప్రశ్నించే ఆకాంక్ష అగ్గిలా రాజుకుంటుంది..ఆ నిప్పు రవ్వల్లో.. నిర్బంధాన్ని ఎదురించే ధిక్కారం ఎగిసిపడుతుంది..బాంచన్ కాల్మొక్తా అన్న గొంతులే ఇక పెత్తనం సాగదంటూ గర్జిస్తాయి..అణిచివేతను సహిస్తున్న పిడికిల్లే పెత్తందారి వ్యవస్థ పునాదులను పెకిలిస్తాయి..నిరంకుశత్వ కోటల్ని నామరూపాల్లేకుండా చేస్తాయి..తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోనూ అలాంటి ఓ ఆవేశమే. దొరల ఆధిపత్యాన్ని సవాల్ చేసింది..భయం గుప్పిట్లో బతుకుతున్న ప్రజలకు గమ్యాన్ని ముద్దాడే ధైర్యమయింది..మహోన్నత పోరాటంలో మరిచిపోలేని జ్ఞాపకమయింది..ఆమే వీరనారి చాకలి ఐలమ్మ 1919లో తరాలు మరిచిపోని ఓ తండ్లాట కళ్లుతెరిచింది..వరంగల్ జిల్లా రాయపర్తి మండలం క్రిష్ణాపూరంలో చాకలి ఐలమ్మ పుట్టింది…పక్కనే ఉన్న పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మకు పెళ్లయింది..నలుగురు కొడుకులు,ఒక కూమార్తే.కులవృత్తే జీవనాధారం..భూతల్లిని నమ్ముకుంటేనైనా కడుపు నిండుతుందని అనుకుంది.. అందుకే పాలకుర్తిలో మల్లంపల్లి భూస్వామి కొండలరావుకున్న 40 ఎకరాల భూమని కౌలుకు తీసుకుంది..అయితే బహుజన కులానికి చెందిన ఐలమ్మ దొరల భూమిని సాగుచేయడం పట్వారీ వీరమనేని శేషగిరిరావు నచ్చలేదు..

దీంతో ఐలమ్మను వేధించాడు..కుటుంబంతో వచ్చి తన పొలంలో కూలి చేయమన్నాడు.. అప్పటికే పాలకుర్తిలో ఆంధ్రమహాసభ ఏర్పడింది..అణిచివేతను ఎదురించాలన్న సంఘం పిలుపునందుకున్న ఐలమ్మ అందుకు ఒప్పుకోలేదు..మాట వినని ఐలమ్మ అంతు చూడాలనుకున్నాడు శేషగిరిరావు..ఐలమ్మ కుటుంబం కమ్యూనిస్టుల్లో చేరిందని విసునూర్ దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశాడు.. దొరల పాలనలో నాటి తెలంగాణ ప్రజల దారుణ పరిస్థితికి విసునూరు ప్రత్యక్ష ఉదాహరణ…ఒకప్పుడు నల్లగొండలో భాగమైన విసునూరు ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఉంది…60 గ్రామాలకు విసునూర్ దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డే జమీందార్..రాక్షసత్వాన్ని నరనరాన ఎక్కించుకున్న దేశ్ ముఖ్ రైతుల భూములను బుక్కపట్టేవాడు..

ఎదురు తిరగిన వాళ్లనే అంతం చేసేటోడు..అలాంటి రాక్షసుడి దారుణాలను ఆంధ్రమహాసభ అడ్డుకుంది..దేశ్ ముఖ్ దుర్మార్గాలను కమ్యూనిస్టులు ప్రశ్నిచారు..అలాంటి సంఘంలో ఐలమ్మ చేరింది..రామచంద్రారెడ్డి ఊరుకుంటాడా? అందుకే ఐలమ్మ కుటుంబంపై దొంగ కేసులు పెట్టించాడు..భర్త నర్సయ్య కొడుకులు సోమయ్య,లచ్చయ్యలను అరెస్ట్ చేయించాడు..అయితే దొర అరాచకత్వాన్ని సంఘం సహాయంతో ఐలమ్మ కోర్టులో సవాల్ చేసింది..తీర్పు ఐలమ్మకే అనుకూలంగా వచ్చింది. ఐలమ్మను ఆర్థికంగా దెబ్బతీస్తే సంఘం పట్టుకోల్పోతుందని భావించిన రామచంద్రారెడ్డి..ఆమె సాగుచేస్తోన్న మల్లంపల్లి భూస్వామి పొలాన్ని తన పేర రాయించుకున్నాడు..ఆరుగాళం కష్టించి ఐలమ్మ పండించిన పంటను కోసుకురమ్మని గుండాలను పంపించాడు..అయితే ఆంధ్రమహాసభ కార్యకర్తలతో పొలం దగ్గరే కాపు కాసిన ఐలమ్మ దొర గుండాలను ఎదురించింది..తాను బతికి ఉన్నన్ని రోజులు పంట దొరకు దక్కదన్న ఐలమ్మ..

ధాన్యాన్ని ఇంటికి తీసుకెళ్లింది..ఈ ఓటమిని తట్టుకోలేని రామచంద్రారెడ్డి తన పంటను కమ్యూనిస్టులు దోచుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు..అయినా ఐలమ్మ బెదరలేదు..మరోసారి న్యాయపోరాటం చేసి గెలిచింది.. రజాకార్ల ఉపసేనాధిపతి అయిన దేశ్‌ముఖ్‌ ఐలమ్మ చేతిలో రెండుసార్లు ఓడిపోయాడు..దీంతో రజాకార్లతో పాలకుర్తిలో దాడులు చేయించాడు..దొర గుండాలు ఐలమ్మ ఇంటిని తగలబెట్టించారు..ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు.. ఐలమ్మ కూతురు సోమనర్సమ్మపై లైంగికదాడి చేశారు..ఐదుగురిని చంపేశారు..

అయినా ఐలమ్మ వెనక్కితగ్గలేదు.. రామచంద్రారెడ్డి దౌర్జన్యాన్ని అడుగడుగునా అడ్డుకుంది..పాలకుర్తి పట్వారీ శేషగిరిరావు ఇంటిని కూల్చి అదే స్థలంలో మక్కలు పండించింది…తన ధిక్కారంతో మహోన్నత పోరాటాన్ని మలుపుతిప్పిన చాకలి ఐలమ్మ సెప్టెంబర్ 10 1985 న చనిపోయింది.. దున్నేవాడిదే భూమి అనే నినాదంతో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధపోరాటంలో చాకలి ఐలమ్మ నిప్పుకణికయింది..రైతులు,కూలీలను ఒక్కటిచేసి ఎర్రజెండా నీడలో నడిపించింది..ఊళ్లలో నుంచి గుండాలను తరిమికొట్టింది..తూటాలు,తుపాకులు,లాఠీ దెబ్బలకు తలొగ్గలేదు..ఐలమ్మ తెగువ చూసి ఎందరో ఉద్యమంలో ఉప్పెనలా కదిలారు..అయినా ఆ వీరనారికి పాలకులు సరైన గౌరవం ఇవ్వలేదు..తెలంగాణ రైతాంగ పోరాటాన్నే చీకట్లో కలిపిన సీమాంధ్ర పాలనలో..ఐలమ్మ విగ్రహానికి ట్యాంక్ బండ్ పై స్థానం దక్కలేదు..ఆమె జీవితం,పోరాటం నేటి తరానికి వారసత్వంగా అందకుండా స్కూల్ పుస్తకాల్లో చాకలి ఐలమ్మ పేరే కనిపించకుండా చేశారు.. ఓ ఆకాంక్ష..బలమైన ఉద్వేగం..అస్తిత్వ వేదన…ఆత్మాభిమాన ఘోష..వలసపోయిన వసంతపు అన్వేషణ.. నిర్బంధాలెన్ని ఉన్నా ముందుకు సాగుతోన్న జనజాతర…తల్లడిల్లే హృదయ నివేదన..నాలుగున్నర కోట్ల జనాల గుండె నిబ్బరం..త్యాగధనుల మరణవాంగ్మూలం..అదే తెలంగాణ ఉద్యమం..నాటి సాయుధ రైతాంగ పోరాటమైనా..నేటి మలిదశ ఉద్యమమైనా…చాకలి ఐలమ్మ పేరు వినిపించకుండా నినాదాలు పిడుగుల్లా గర్జించవు..ఆమె చేసిన త్యాగాన్ని తలుచుకోకుండా ఎత్తిన పిడికిల్లు కిందకు దిగవు..