Chiyaan Vikram addresses rumours of heart attack at Cobra audio launch, thanks fans for their love
mictv telugu

నా ఫేస్‌ని మార్ఫింగ్ చేశారు.. ఇలాంటివి ఎన్నో అనుభవించా.. విక్రమ్

July 12, 2022

తమిళ, తెలుగు ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో చియాన్‌ విక్రమ్‌ ఇటీవల అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఛాతీలో ఇబ్బందిగా అనిపించడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు వచ్చిందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. విక్రమ్ ఆరోగ్యంపై అభిమానులు కాస్త కంగారు పడడంతో కేవలం ఆయన అస్వస్థతకు మాత్రమే గురయ్యారని.. గుండెపోటు కాదని ఆయన తనయుడు ధ్రువ్‌ ఖండించారు. తాజాగా కోబ్రా ఆడియో లాంచ్‏లో విక్రమ్ దీనిపై స్పందించారు. వేదికపై విక్రమ్‏ను స్టైలీష్ లుక్ లో చూసి అభిమానులు థ్రిల్ అయ్యారు. సెమీ ఫార్మల్ డ్రెస్సింగ్ లో ఎంతో సంతోషంగా కనిపించాడు. అంతేకాకుండా.. వేదికపై ప్రసంగిస్తూ తన ఆరోగ్యం పట్ల వచ్చిన రూమర్స్ గురించి ఫన్నీ కామెంట్స్ చేశారు.

‘నా ఆరోగ్యం గురించి ఆ రోజు సోషల్ మీడియాలో ఏవేవో వార్తలు రాశారు. వాటన్నింటినీ నేను చూశా. జబ్బుపడిన వ్యక్తి ఫొటోలకు నా తలను పెట్టి మార్ఫ్‌ చేశారు. ఫొటోపై నా పేరు పెడుతూ థంబ్‌ నెయిల్స్‌ క్రియేట్‌ చేశారు. వాళ్ల క్రియేటివిటీ బాగుంది. థ్యాంక్యూ. నా జీవితంలో ఇలాంటివి ఎన్నో అనుభవించా. ఇదేమీ నన్ను పెద్దగా ఆందోళనకు గురిచేయలేదు. నా కుటుంబం, స్నేహితులు, అభిమానులు నాకు అండగా నిలిచారు. ఇంతకు మించి జీవితంలో నాకేమీ వద్దు’’ అని అన్నారు.

ఇక కోబ్రా సినిమా విషయానికొస్తే.. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు కె.జి.య‌ఫ్‌లో న‌టించిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌. ఈ సినిమాలో విక్ర‌మ్ చాలా గెట‌ప్స్ వేశారు. అవేంటో చూడాలంటే మాత్రం సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందే.