చియాన్ విక్రమ్ ఏది చేసినా కొత్తగానే ఉంటుంది. సినిమా సినిమాకు వేరియేన్స్ చూపిస్తూ ప్రేక్షకుల మనసులను దోచేస్తుంటాడు. ఇప్పుడు తంగళన్ అనే తమిళ సినిమా కోసం కొత్త లుక్స్ తో అదరగొడుతున్నాడు. తమిళ హీరో విక్రమ్.. తెలుగు వారికీ సుపరిచితుడే. అపరిచితుడు, ఐ.. ఇలాంటి సినిమాలతో తెలుగువారి మనసునూ దోచేశాడు. విక్రమ్ అంటేనే ఒక కొత్తదనం అనేలా తన లుక్స్, యాక్టింగ్ స్కిల్స్ తో తన సినిమాల గురించి ఎదురుచూసేలా చేశాడు.
మొన్నటికి మొన్న పొన్నియన్ సెల్వన్ 1 సినిమాతో అటు తమిళం, ఇటు తెలుగు వారిని హిట్ తో పలకరించాడు. ఇక రెండవ పార్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ 2 కూడా ఏప్రిల్ లో రిలీజ్ అవుతుందనే అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతలోనే కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన న్యూ లుక్ విడుదల చేశాడు విక్రమ్. ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ అనే క్యాప్షన్ రాసి తంగళన్ సినిమాలో తాను ఎలా కనిపించబోతున్నాడోనన్న స్టిల్స్ పోస్ట్ చేశాడు. గుబురు గడ్డం, నెత్తిన చిన్న పిలక, నల్ల కల్లజోడుతో పర్ఫెక్ట్ రగ్గడ్ లుక్ తో కనిపించాడు.
వర్సటాలిటీ యాక్టర్ అయిన విక్రమ్ ని చూసిన వారంతా ఒక్కో సినిమాకూ ఒక్కోలా మలుచుకుంటున్న తనను చూస్తే పొగడలేకుండా ఉన్నామని అంటున్నారు. ఇక తంగళన్ విషయానికొస్తే ఇందులో విక్రమ్ సరసన మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు కనిపించబోతున్నారు. కోలార్ గోల్డ్ ఫ్యాక్టరీలో జరిగిన సంఘటలన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ నిజమైన కథకు పా రంజిత దర్శకత్వం వహించనున్నారు. బ్రిటీష్ పాలనలో పనిచేస్తున్న వ్యక్తులపై ఈ చిత్రం ప్రధానంగా సాగుతుంది. కిషోర్ కుమార్ ఛాయాగ్రహణం, జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.