పిల్లల కడుపులో పెట్రోల్..! - MicTv.in - Telugu News
mictv telugu

పిల్లల కడుపులో పెట్రోల్..!

June 23, 2017

పోరగాళ్లు బడికివోమని మారం చేస్తే ఏం చేస్తం ?..ఆళ్లను బుదిరికిచ్చి ఓ చాక్లేటో బిస్కెటో కోనిచ్చి బళ్లకు తోల్తం,సుట్టాలింటికో తెల్శినోళ్లింటికో వోతున్నప్పుడు ఆళ్లింట్ల బుడ్డపోరగాన్లుంటే..ఓ బిస్కోట్ల పుడనో చాక్లేటో కొన్కవోతం,మరి గిప్పటిసుంది గట్ల పోరగాన్లకు శాకెట్లు బిస్కోట్లు కొనిచ్చెటప్పుడు జరంత ఆలోశన జెయ్యున్రి,ఎందుకంటరా ఇంకెందుకు …ఇది కలికాలం గాదు మొత్తం కల్తికాలం,యూరియాతోని పాలు,ఇటికెపొడితోని కారం,అరటితొక్కలతోని అల్లం పేస్టు,జీవరాశుల కొవ్వుతోని వంటనూనే…ఏ గిట్ల శెప్పుకుంటవోతే గీ కమ్మ సాలది..సద్వనీకి మీఓపిక సాలది.

పెట్రోల్ తో చాక్లెట్లు…!

ఎచ్చం మసాలాల కాన్నుంచి అన్నింటిని కల్తీజేశె బద్మాశ్ గాళ్లు… మరిలొట్టలేస్కుంట కమ్మగుందని పోరగాళ్లు తినే చాకెట్లను బిస్కోట్లను ఎందుకు ఇడ్శిపెట్టాలని అన్కున్రో ఏమో…గవ్విట్నిగుడ మొత్తం కల్తీ జేస్తున్నరు,చాక్లెట్లలల్ల పెట్రోలియం రసాయనాలు,కాడ్మియం లెడ్ అనే రసాయనాలు ఇష్టమచ్చినట్టు కల్పి..మార్కెట్లల్ల అమ్ముతున్నరట,ఇగ అవ్విట్ని సూస్తె అనుమానం రావద్దని పెద్ద పెద్ద బ్రాండ్ చాకెట్లుంటయ్ జూడిన్రి…గదే టీవీల అడ్వటేస్ మెంట్ల సూపెడ్తరు సుడు..తియ్యని వేడుక చేస్కుందాం అని లొట్టలేస్కుంట తింటరు గదా..గంసొంటి పెద్ద పెద్ద బ్రాండ్ మీది కవర్లు ఆళ్లు తయారుజేశ్న కల్తీ చాకెట్లకు తొడ్గుతున్రట,ఇగేముంది మీదికి సూస్తే బ్రాండ్…లోపట చాక్లేటేమే అడ్డమైన రసాయనాలు కల్పుతరు గావట్టి.. కమ్మగనే ఉంటది,పోరగాళ్లు పెద్దోళ్లు కమ్మగున్నయ్ అన్కుంట ఇంక రొండు ఎక్కువనే తింటరు,అందుకే ఆళ్ల దందగుడ మూడు కల్తీ చాకెట్లు ఆరు అడ్డమైన బిస్కెట్లలెక్క మస్తు నడుస్తున్నది.

బర్ల దాణాతో బిస్కెట్లు..!

పెయ్యికి బలమిస్తయని మస్తు ఎనర్జీనిస్తయని బిస్కెట్లు తింటం గదా,అవ్విట్నిగుడ బర్లకు వెట్టే దాణా..తూట్ పాలీష్ మైదా పిండి,అడ్డమైన నూనె,పన్కిరాని పిప్పి అన్ని కల్పి తయారు జేస్తున్నరట,ఇగ ఈబిస్కెట్లను అగ్గువ అగ్గువ అన్కుంట పాకెట్లల్ల ఓ నాల్గు బిస్కెట్లు ఎక్కో వెట్టెవర్కు..పబ్లిక్కుగుడ అరె ధర తక్కువ,బిస్కెట్లెక్కువ గీ ఆఫరేదో మంచిగున్నది..పోతె మల్లా దొర్కదన్కొని, ఇంక రొండు ప్యాకెట్లు ఎక్కోనే కొన్కవోతున్నరట.

టైం పాస్ చిప్స్…

అప్పుడప్పుడు టైపాస్ కోసమనీ చిప్స్ తింటం గదా, గవ్విట్నేమో ముర్గిపోయిన ఆలుగడ్డలను,బొక్కలనుంచచ్చిన నూనెల గోలిచ్చి మీద మంచిగ ఇంత ఉప్పు కారం సల్లుతున్నరట,గ కారంగుడ నిజంగ కారమేనో ఇట్కపొడి కల్పిందో.

అంతా రోగమయం…!

రంగు రుచి మంచిగుండనీకి అడ్డమైనయ్ కల్పుతున్రు గావట్టి..ఇవ్విట్ని తింటె నెత్తినొప్పి, బిపి ఆస్తమా,నిద్రవట్టకపోవడం ఇన్ఫెక్షన్, ఆఖర్కి క్యాన్యర్ అసొంటి అడ్డమైన రోగాలు గుడ అస్తయట,చాక్లెట్లలల్ల పెట్రోల్ రసాయనాలు కల్పుతున్నరు గావట్టి కడ్పుగుడ పెట్రోల్ బాయి అవ్వుడు ఖాయం,
కాబట్టి అగ్గువకస్తున్నయని క్వాంటిటీ ఎక్కువస్తుందనీ అడ్డమైనయ్ తిని రోగాలు దెచ్చుకోకున్రి…అయినా ఏది కల్తీదో ఏది మంచిదో గుర్తువట్టకుంటనే కథలు వడ్తున్నరు గదా ఈ కల్తీరాయుళ్లు.ఒకవేళ తిన్నా.. రోగాలు అస్తె దవాఖాన్లకోతే.. డాక్టర్ రాసిచ్చిన గోలీలు మింగుదామంటే అవ్విట్నిగుడ కల్తీ జేస్తున్నరు గదాతీస్మార్కాన్ కల్తీగాళ్లు.

తినే తిండిలను శెకింగ్ జేశే ఆఫీసర్లుగుడ గీ కల్తీగాళ్లకోసం బాగనే వేటాడుతున్నరట,కనీ ఆళ్లుగుడ ఎన్నని దొర్కవడ్తరు ఎందర్ని లోపటేస్తరు..ఏదిజూశ్న కల్తీయేనాయే,దొర్కినోన్ని దొర్కినట్టు ఆళ్లు తయారుజేశ్న కల్తీ వస్తువలను ఆళ్ల నోట్లనే కుక్కి కుక్కీ వెట్టాలే.. అప్పుడు తొవ్వకస్తరు గావచ్చు.