బాలీవుడ్‌లో తీరని విషాదం.. ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

బాలీవుడ్‌లో తీరని విషాదం.. ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్నుమూత

July 3, 2020

Choreographer Saroj Khan Passes Away

బాలీవుడ్ లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ (71) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా శుక్రవారం ఉదయం ఆమె ముంబైలో తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా ఆనారోగ్యంతో ఉన్న ఆమె గత నెల 20న బాంద్రాలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె కూతురు మరణాన్ని ధృవీకరించారు. దీంతో బాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఎన్నో చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పని చేసిన సరోజ్ ఖాన్ లేరనే లోటు పూడ్చలేదని పలువురు అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యులు అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. 

చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ రంగ ప్రవేశం చేసిన సరోజ్ ఖాన్ దాదాపు 2వేల సినిమా పాటలకు కొరియోగ్రఫీ చేశారు. దేవదాస్ సినిమాలోని ‘దోలా రే దోలా’, తేజాబ్‌లో మాధురీ దీక్షిత్ నర్తించిన ‘ఏక్ దో తీన్’, చోలీకే పీచే క్యాహై..యే ఇష్క్ హై లాంటి సూపర్ హిట్ పాటలకు డ్యాన్స్ కంపోజ్ చేసింది కూడా ఆమె. వీటికి ఎన్నో అవార్డులు కూడా దక్కాయి. కొరియోగ్రఫీలో జాతీయ  అవార్డులు సొంతం చేసుకున్నారు. 2019లో ‘కళంక్’  సినిమాలోని ‘తబా హోగయీ’ పాటకు చివరిసారిగా కొరియోగ్రఫీ చేశారు. కాగా ఇటీవల అనారోగ్యంతో ఆమె ఆస్పత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో కరోనా పరీక్షలు కూడా చేశారు. అయితే అందులో నెగిటివ్ అని వచ్చింది. గుండెపోటుతో కన్నుమూయడంతో అభిమానులు విషాదంలో మునిగిపోయారు. కాగా గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రముఖ నటులు, సంగీత దర్శకుడు ఇటీవల అకాల మరణం చెందగా తాజాగా సరోజ్ ఖాన్ మరణం అందరిని కలిచివేసింది.