పంజాబ్ పాంచ్ పటాకా.. ప్లేఆఫ్ ఆశలు సజీవం! - MicTv.in - Telugu News
mictv telugu

పంజాబ్ పాంచ్ పటాకా.. ప్లేఆఫ్ ఆశలు సజీవం!

October 27, 2020

పంజాబ్

పంజాబ్ జట్టు దూకుడు పెంచింది. వరుసగా ఐదు విజయాలను నమోదు చేసి డబల్ హ్యాట్రిక్ విజయాలపై కన్నేసింది. సోమవారం కోల్కతతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన ప్లేఆఫ్ అవకాశాలను సజీవం చేసుకుంది. నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కత నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. కోల్కతా ఆటగాళ్లలో గిల్(57), మోర్గాన్ (40), ఫెర్గుసన్ (24) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో షమీ మూడు వికెట్లు, జోర్డాన్, రవి రెండేసి వికెట్లు తీశారు. మురుగన్ అశ్విన్, మక్సవెల్ తలా ఓ వికెట్ తీశారు. 

150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఆటగాళ్లలో గేల్, మన్‌దీప్ సింగ్ చెలరేగిపోయారు. తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించిన తరువాత కెప్టెన్ కేఎల్ రాహుల్(28) అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన క్రిస్ గేల్ 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 51 పరుగులు చేసి విజయానికి మూడు పరుగుల ముందు అవుటయ్యాడు. మరోవైపు మన్‌దీప్ సింగ్ 56 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. దీంతో మరో 7 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ విజయాన్ని అందుకుంది. ఫలితంగా 12 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకోగా, ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐదో స్థానానికి దిగజారింది. క్రిస్‌గేల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.