మహిళను చీర ఊడేలా నడిరోడ్డుపై కొట్టిన సీఐ అంజూ యాదవ్ - MicTv.in - Telugu News
mictv telugu

మహిళను చీర ఊడేలా నడిరోడ్డుపై కొట్టిన సీఐ అంజూ యాదవ్

October 1, 2022

శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించి వివాదంలో చిక్కుకున్నారు. సామాన్యులతో పాటు నాయకులను కూడా లెక్కచేయరని పేరు ఉన్న ఆమె.. నీ భర్త ఎక్కడంటూ ఓ మహిళపై అమానుషంగా దాడి చేసింది. మహిళ కుమారుడు అడ్డుకుంటున్నా వినకుండా బలవంతంగా లాగి జీపులోకి ఎక్కించింది. వివరాల్లోకెళితే.. ప్రముఖ దేవస్థానమైన శ్రీకాళహస్తిలో ఓ మహిళ హోటల్ నడుపుకుంటోంది. అయితే సడెన్‌గా హోటల్‌కి వచ్చిన సీఐ అంజూ యాదవ్.. నీ భర్త ఎక్కడని అడగ్గా, ఆమె తెలియదని సమాధానమిచ్చింది.

దాంతో ఆగ్రహించిన సీఐ ‘మేడం అని పిలవడం తెలియదా. బూటు కాలితో తంతా’నంటూ పరుష పదాలతో దూషించారు. అనంతరం ఆమెను బలవంతంగా నడి రోడ్డుపై లాక్కొచ్చి కొట్టారు. ఇంతలో ఆమె కుమారుడు ‘మా అమ్మ పెద్ద ఆపరేషన్ చేయించుకుంది వదిలేయంది మేడం’ అని వేడుకుంటున్నా వినిపించుకోలేదు. మహిళ చీర ఊడిపోయేలా దాడి చేసి రాత్రి పూట పోలీస్ స్టేషనుకి తరలించారు. తర్వాత మహిళ అనారోగ్యానికి గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు. సీఐ కొంతకాలంగా తమను వేధిస్తోందని, అకారణంగా దాడి చేస్తోందని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు సీఐ ప్రవర్తనపై ఆరా తీస్తున్నారు. ఎందుకలా కోపంగా ప్రవర్తించారు? మహిళ భర్తను ఏ కేసులో ప్రశ్నించాలనుకున్నారు? వంటి వివరాలు తెప్పించుకుంటున్నారని తెలిసింది.