‘జార్జిరెడ్డి’, ‘ప్రెజర్ కుక్కర్’ చిత్రాలతో టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన నిర్మాత అన్నపరెడ్డి అప్పిరెడ్డి మరో చిత్రం నిర్మిస్తున్నారు. తెలుగు బిగ్‌బాస్-4తో తెలుగువారిని ఆకట్టుకున్న సోహెల్ హీరోగా ఓ చిత్రాన్ని ప్రకటించాడు. మూవీ టీం గురువారం ఈ విషయాన్ని విలేకర్ల సమావేశంలో వెల్లడించింది. మైక్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఆయనకు తొలి చిత్రం. ఫిబ్రవరి నుంచి సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇదివరకు టాలీవుడ్లో కొన్ని చిత్రాల్లో చిన్నతరహా పాత్రలు పోషించిన సోహెల్‌కు హీరోగా ఇదే తొలిచిత్రం.
బిగ్‌బాస్‌లో విజేత కాకపోయినా సోహెల్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఫైనల్‌కు రాకుముందే తనకు ఆఫర్ చేసిన ప్రైజ్ మనీ తీసుకుని బయటికొచ్చిన సోహెల్ తన మనసుకు నచ్చినట్టే చేశాడని, అతనిలో నిజాయతీ ఉందని అభిమానులు కొనియాడుతున్నారు. చిరంజీవి, నాగార్జున, బ్రహ్మానందం తదితర సెలబ్రిటీలు అతనికి సాయం చేయడానికి ముందుకొచ్చారు.