సినిమా ప్రేమికులకు శుభవార్త. జనవరి 20.. ‘సినిమా లవర్స్ డే’. ఈ సందర్భంగా కొన్ని థియేటర్లలో, కొన్ని నగరాల్లో సినిమాను కేవలం 99 రూపాయలకే వీక్షించే ఛాన్స్ దొరికింది.
99 రూపాయలకు ప్రదర్శించబడే చిత్రాల జాబితాలో.. అవతార్.. ది వే ఆఫ్ వాటర్, తునీవు, వరిసు ఉన్నాయి. ఈ మూడు సినిమాలు ఇప్పటికే ఇండియన్ థియేటర్లలో బ్లాక్ బస్టర్స్ గా ప్రకటించబడ్డాయి. జేమ్స్ కామెరూన్ అవతార్ : ది వే ఆఫ్ వాటర్ భారతీయ బాక్సాఫీస్ వద్ద 471 కోట్లతో అన్నిరికార్డులను బద్దలు కొట్టింది. ఇక విజయ్, రష్మిక మందన్న జంటగా నటించిన వరిసు కూడా ఏడు రోజుల్లో 100 కోట్ల మార్కును దాటింది. అజిత్ నటించిన తునీవు కూడా భారతదేశంలో ఇప్పటివరకు 87.40కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ సినిమాలు కాకుండా మళ్లీ విడుదల కానున్న వేద్, పస్ ఇన్ బూట్స్, కుట్టే, కాశ్మీర్ ఫైల్స్ వంటి సినిమాలను కూడా చూడొచ్చు.
అనేక థియేటర్ యజమానులు, మల్టీప్లెక్స్ చైన్స్ ఈ ఆఫర్ ను ఉపయోగించుకోవాలని ప్రేక్షకులను ప్రోత్సహిస్తున్నాయి. ఓటీటీ వినియోగం పెరుగుతున్న తరుణంలో థియేటర్లలో ఫుట్ ఫాల్ ను పెంచే ప్రయత్నంలో ఈ ఆఫర్ బాగా పనిచేస్తుందని భావిస్తున్నారు. ఇలాంటి ఆఫర్ ప్రకటించడం ఇదేం మొదటిసారి కాదు. గత సంవత్సరం సెప్టెంబర్ 23న ‘ప్రపంచ సినిమా దినోత్సవం’ సందర్భంగా చాలా థియేటర్ల టికెట్ ధర కేవలం 75 రూపాయలుగా చేశారు. ఈ బంపర్ ఆఫర్ వల్ల ఆ రోజు 4వేలకు స్క్రీన్స్ ల్లో 6.5మిలియన్లకు పైగా సినీ ప్రేక్షకులు సినిమాలను ఆస్వాదించారు.
పీవీఆర్ సినిమాస్ జనవరి 20న ప్రదర్శించబడే అన్ని సినిమాలకు కేవలం రూ. 99 టిక్కెట్ ధరను అందిస్తున్నది. ఇది సాధారణ ధర శ్రేణి రూ.200-300. ఐనాక్స్, సినీ పోలీస్ మల్టీప్లెక్స్ థియేటర్లు కూడా ఇలాంటి తగ్గింపులను అందిస్తాయి. ఈ మ్యాజికల్ ఆఫర్ పై పీవీఆర్ సినిమాస్ ట్వీట్ చేసింది. సినీ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ ఉన్నట్లు ప్రకటించింది.
షరతులు వర్తిస్తాయి..
ఈ ఆఫర్ లో కొన్ని షరతులు ఉన్నాయి. ఈ ఆఫర్ ప్రధాన స్రవంతి సీట్లకు మాత్రమే వర్తిస్తుంది. రిక్లైనర్ సీట్లు, ఐమ్యాక్స్, 4డీఎక్స్ సినిమా అనుభవం ఉన్నవాటికి ధరల్లో మార్పు ఉండదు. ఈ ఆఫర్ భారతదేశంలోని అన్ని నగరాల్లో కూడా చెల్లుబాటు కాదు. ఇది టైర్ 1 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ల్లో రూ. 100కి ఆఫర్ ను పొందొచ్చు. అయితే ఈ ఆఫర్ కు పన్నులతో కలిపి టిక్కెట్ ధర రూ. 110-112 అవుతుంది. ఈ ఆఫర్ ను జనవరి 20, 2023న మాత్రమే పొందవచ్చు. స్థానిక థియేటర్లతో పాటు, బుక్ మై షో, పేటీఎమ్ ల్లో కూడా ఆఫర్ అందుబాటులో ఉంటుంది.