పదవీ విరమణ చేసిన జాగిలాలకు ఘనంగా వీడ్కోలు..  - MicTv.in - Telugu News
mictv telugu

పదవీ విరమణ చేసిన జాగిలాలకు ఘనంగా వీడ్కోలు.. 

November 20, 2019

నేరస్థులను కేవలం వాసన చూసి పసిగట్టగల దిట్టలు ఏవంటే మనకు టక్కున గుర్తుకువచ్చే పేరు జాగిలం. పోలీసు జాగిలం అని కూడా అంటారు. పోలీస్ శాఖలో వాటి సేవలు అనన్య సామాన్యమైనవి. అందుకే వాటి సేవల విలువను గుర్తించారు పోలీసులు. వాటి పదవీకాలం ముగియడంతో మనుషులకు మాదిరి వాటికి ఘనంగా వీడ్కోలు పలికారు. శాఖలో వాటి పనితీరుకు మచ్చుతునకలుగా వాటికి మెమొంటోలు, గోల్డు మెడల్స్ బహూకరించారు. ఒక్కో జాగిలం శాఖకు చేసిన సేవలను వాటి పేర్లతో కీర్తించారు. చిత్రంగా ఉన్నా ఇది చాలా ఉన్నతమైన ఆలోచన కదూ. చరిత్రలో ఇలా జాగిలాల సేవలను గుర్తించి వాటిని ఘనంగా సత్కరించుకోవడం ప్రథమం. 

CISF Dogs..

ఢిల్లీలోని సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ ( సీఐఎస్‌ఎఫ్‌) కే9 యూనిట్‌ సిబ్బంది ఈ మహోన్నత కార్యానికి పూనుకున్నారు. జాగిలాల వీడ్కోలు కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఢిల్లీ మెట్రో పారామిలిటరీ విభాగంలో ఇవి గత ఎనిమిదేళ్లుగా పనిచేశాయి. వాటిని ఇప్పుడు ఎన్జీవోలకు అప్పగిస్తున్నారు. ఈ సందర్భంగా వాటి సేవలను మననం చేస్తూ వాటిని పతకాలతో సత్కరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐఎస్‌ఎఫ్‌ తమ అధికారికి ట్విటర్‌లో పంచుకుంది. ఇన్నాళ్లు సేవలందించినందుకు జాగిలాలకు కృతజ్ఞతలు అని సీఐఎస్‌ఎఫ్‌ పేర్కొంది. జెస్సీ, లక్కీ, లవ్‌లీ జాగిలాలు అధికారికంగా విధుల నుంచి విరమణ పొందాయని వారు తెలిపారు.

వాటికి మెమొంటోలు, సర్టిఫికెట్లు ప్రదానం చేసినట్లు పేర్కొన్నారు. జాగిలాలకు ఇలా వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేయడం సీఐఎస్ఎఫ్‌ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి అవడం విశేషం. జాగిలాలకు వీడ్కోలు పలికిన సీఐఎస్‌ఎఫ్‌ తీరుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. మీ ఔన్యత్యానికి జేజేలు అంటూ కామెంట్లు చేస్తున్నారు.