8 నుంచి హైదరాబాద్‌లో సిటీ బస్సులు ప్రారంభం  - MicTv.in - Telugu News
mictv telugu

8 నుంచి హైదరాబాద్‌లో సిటీ బస్సులు ప్రారంభం 

June 3, 2020

తెలంగాణలో ఇప్పటికే జిల్లా బస్సు సర్వీసులు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇక హైదరాబాద్‌లోనూ సిటీ బస్సులను నడిపేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా గత 70 రోజులుగా డీపోలకే పరిమితం అయిన సిటీ బస్సులు.. ఈ నెల 8 నుంచి నగరంలో ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌పై సడలింపులు ఇవ్వడంతో సిటీ బస్సులతో పాటు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ బుధవారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో బస్సులు ఏ విధంగా నడపాలనే దానిపై అధికారులతో చర్చించారు. ఈ మేరకు జూన్ 8 నుంచి సిటీ బస్సులను నడపాలని నిర్ణయించారు. మాస్కులు, శానిటైజర్లు, భైతిక దూరం ఉండేలా బస్సుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. 

కాగా, లాక్‌డౌన్‌పై కేంద్రం మరికొన్ని సడలింపులతో కొత్త మార్గదర్శకాలు జారీ చేయడంతో తిరిగి పనులు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పారిశ్రామిక కార్యకలాపాలు కూడా మొదలయ్యాయి. గతకొంత కాలంగా సిటీలో బస్సు సర్వీసులు లేకపోవటంతో అటు సిబ్బందితో పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిటీలో నిత్యం 33 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సాగిస్తారు. అన్ని కార్యకలాపాలు ప్రారంభం కావటంతో.. నిత్యం బస్సుల్లో వెళ్లాల్సినవారు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఆటోల్లో డబ్బులు ఎక్కువ వసూలు చేయడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో షేర్ ఆటో ప్రయాణం క్షేమం కాదన్న భయంతో అటువైపు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎక్కువ మంది సొంత వాహనాలపై వెళ్తున్నారు. ఎటొచ్చీ సొంత వాహనాలు లేనివారే ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం సీటీ బస్సు సర్వీసుల పునఃప్రారంభానికి అనుమతిచ్చే అవకాశాలు ఉన్నాయి.