టాలీవుడ్ యాంగ్రీ యంగ్మాన్గా పేరుగాంచిన హీరో రాజశేఖర్ చిక్కుల్లో పడ్డారు. ఆయన తాజాగా నటించిన ‘శేఖర్’ చిత్రం విషయంలో కోర్డు బిగ్ షాక్ ఇచ్చింది. ఫైనాన్షియర్ ఎ.పరంధామరెడ్డికి ఇవ్వాల్సిన రూ.65,00,000 ఇవ్వకపోతే ‘శేఖర్’ సినిమా ప్రదర్శన ఆగిపోతుంది అని ఆదేశాలు జారీ చేసింది. సినిమా కోసం నిర్మాత జీవితా రాజశేఖర్ ఫైనాన్షియర్ ఎ.పరంధామరెడ్డి దగ్గర గతంలో రూ.65,00,000 తీసుకున్నారని, తీసుకున్న అప్పు పూర్తిగా చెల్లించకపోవడంతో పరంధామరెడ్డి హైదరాబాద్‌లోని సిటీ సివిల్‌కోర్టు కోర్టును ఆశ్రయించాడు.
పరంధామరెడ్డి మాట్లాడుతూ..‘‘48 గంటలలోగా రూ.65 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్‌గా జీవిత రాజశేఖర్ సమర్పించాలి. అలా చేయని పక్షంలో ‘శేఖర్’ సినిమాకు సంబంధించిన సర్వ హక్కులను (నెగటివ్ రైట్) అటాచ్మెంట్ చేస్తూ డిజిటల్, శాటిలైట్, ఓటీటీ, యూట్యూబ్ వంటి మాధ్యమాలతోపాటు సినిమా ట్రైలర్‌ను కూడా ఎక్కడా ప్రసారం చేయకుండా నిలిచిపోతుంది. అటాచ్మెంట్ అమలులోకి వస్తే ఆదివారం తర్వాత ‘శేఖర్’ సినిమా ఏ ప్లాట్ఫామ్లో ప్రదర్శించినా న్యాయస్థానాన్ని ధిక్కరించినట్లు అవుతుంది’’ అని ఆయన అన్నారు.
ఇక, ‘శేఖర్’ సినిమా విషయానికొస్తే.. రాజశేఖర్ హీరోగా జీవిత దర్శకత్వం వహించిన ‘శేఖర్’ శుక్రవారం (మే 20) విడుదలైన సంగతి తెలిసిందే. మలయాళం హిట్ ఫిల్మ్ ‘జోసెఫ్’కు రీమేక్ అయిన ఈ సినిమా ఇటు విమర్శకుల నుంచి అటు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. ఈ మూవీలో ఆత్మీయ రాజన్, శివానీ రాజశేఖర్, ముస్కాన్, కన్నడ కిశోర్, సమీర్, భరణి, రవివర్మ, పోసాని కృష్ణమురళి, ప్రకాశ్ రాజ్ నటించారు.