గత వారం రోజులుగా హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వర్షాలతో రోడ్లన్నీ జలమయం అవ్వడంతో పలు చోట్ల భారీ ట్రాఫిక్ జామ్. ఇక రాత్రి సమయాల్లో ఆఫీసుల నుండి ఇళ్లకు వెళ్లే పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. ప్రజా రవాణా ప్రశ్నార్థకంగా మారింది.
అసలు బయటకు అడుగు పెట్టినవాళ్లు, ఇంటికి చేరుతారా లేదా అన్న అనుమానం కలిగే స్థాయికి నగర ట్రాఫిక్ చేరుకుంది. ఈ పరిస్థితుల్లో బెస్ట్ ఆప్షన్‌గా చాలామంది నగర ప్రజలు హైదరాబాద్ మెట్రో రైళ్లలోనే ప్రయాణం చేస్తున్నారు.ఇబ్బందులు పడుతూ సొంత వాహనాలపై ప్రయాణించడం కంటే, మెట్రోలో సౌకర్యవంతంగా, సమయానుకూలంగా ప్రయాణించడం ఉత్తమమని భావిస్తున్న నగరవాసులు, మెట్రోరైల్ ప్రయాణానికే జై కొడుతున్నారు. దీంతో మూడు కారిడార్ల పరిధిలోనూ ప్రయాణీకుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. మూడు కారిడార్ల పరిధిలో ప్రయాణికుల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగినట్లు మెట్రో రైలు వర్గాలు పేర్కొంటున్నాయి.