Home > Featured > తదుపరి సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టీస్ ఈయనే

తదుపరి సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టీస్ ఈయనే

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ పేరును కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీకాలం ఆగస్టు 26తో ముగియనుండగా.. ఆయన స్థానంలో జస్టిస్ యూయూ లలిత్‌ను నియమించాలని కొలీజియం నిర్ణయించింది. కొత్త సీజేఐ నియామక అంశంపై ప్రస్తుత సీజేఐ ఎన్వీ రమణ నుంచి అభిప్రాయం కోరుతూ కేంద్ర న్యాయ శాఖ లేఖ రాసింది. దీనిపైన సమావేశమైన సుప్రీంకోర్టు కొలీజియం ప్రధాన న్యాయమూర్తితో పాటుగా ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల భర్తీ పైన చర్చించింది.

సుప్రీంకోర్టు సీనియారిటీ లిస్టులో జస్టిస్‌ రమణ తర్వాత న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ ఉన్నారు. దీంతో సుప్రీంకోర్టు 49వ సీజేగా ఆయన పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ లేఖను కేంద్ర న్యాయశాఖ.. ప్రధానమంత్రి పరిశీలన కోసం పంపనుంది. ఆయన ఆమోదం తర్వాత రాష్ట్రపతికి చేరుకుంటుంది. అంతిమంగా రాష్ట్రపతి అనుమతితో తదుపరి ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపడతారు. అయితే ఆయన పదవీకాలం నవంబర్‌ 8 వరకే ఉంది. సీజేఐగా రెండున్నర నెలలే పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం యూయూ లలిత్‌ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. న్యాయమూర్తి కంటే ముందు సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. జస్టిస్‌ లలిత్‌ సుప్రీంకోర్టుకు నేరుగా పదోన్నతి పొందిన 6వ సీనియర్‌ న్యాయవాది.

Updated : 4 Aug 2022 1:48 AM GMT
Tags:    
Next Story
Share it
Top