పెండ్లి కూడా ఒక పరీక్షలాంటిదే అంటారు. మరి అదే పెండ్లి రోజున నిజమైన పరీక్ష ఎదురైతే..? రెండూ ముఖ్యమే అని తలచిన వధువు పెండ్లికూతురు గెటప్ లోనే అటు పరీక్షకూ, ఇటు పెండ్లికీ హాజరైంది.
కొన్నిసార్లు మనకు తెలియకుండా కొన్ని అడ్డంకులు మన జీవితంలో ఎదురవుతుంటాయి. వాటిని మనం మేనేజ్ చేస్తే ఇక జీవితంలో తిరుగుండదు. కేరళకి చెందిన వధువుకు ఇలాంటి ఒక గడ్డు సమస్య ఎదురైంది. అటు పెండ్లి రోజు, ఇటు తను రాయాల్సిన ప్రాక్టికల్ ఎగ్జామ్ ఒకే రోజు అయింది. రెండూ తన జీవితంలో ముఖ్యమైన ఘట్టాలే! రెండింటికీ తను న్యాయం చేసి అందరి చేత మన్ననలు పొందుతున్నది.
వధువు శ్రీలక్ష్మి అనిల్ బెథానీ నవజీవన్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ విద్యార్థిని. ఆమె పెండ్లి ఇటీవలే నిశ్చయమైంది. విచిత్రమేమిటంటే ఆమె ప్రాక్టికల్ ఎగ్జామ్, పెండ్లి రోజు ఒకటే రోజు అయింది. ఈమె పరీక్ష హాల్ లోకి ప్రవేశించే వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. ఈ వీడియోలో.. పసుపు రంగు వివాహ చీరను ధరించి, భారీ ఆభరణాలతో, ఫుల్ గా మేకప్ వేసుకొంది. అంతేకాదు.. లోపలకి వస్తూ తెల్ల కోటు, ఆ పై స్టెత స్కోప్ ధరించి కాలేజ్ లోకి అడుగు పెట్టింది. అందరూ ఆమెను నవ్వుతూ ఆహ్వానించారు. పరీక్ష ముగిసిన తర్వాత ఆమె బయటకు వచ్చి అమ్మను కౌగిలించుకుంది. ఇదంతా ఈ వీడియోలో ఉంది. ఇన్ స్టాలో వారం క్రితం పెట్టిన ఈ వీడియో ఇప్పటికి ఒక మిలియన్ కంటే ఎక్కువ వీక్షణలను పొందింది. కొందరు పరీక్షల సమయంలో పెళ్లి ఎందుకు ప్లాన్ చేశారని అనగా, మరికొందరు ఆల్ ద బెస్ట్ చేసి ఆ పెండ్లికూతురు డెడికేషన్ ని పొగుడుతున్నారు. మొత్తానికి ఇప్పుడు ఈ పెండ్లి కూతురు నెట్టింట చాలా ఫేమస్ అయింది.