రాత్రి 7 గంటలకు చప్పట్లు కొట్టండి.. జగన్  - MicTv.in - Telugu News
mictv telugu

రాత్రి 7 గంటలకు చప్పట్లు కొట్టండి.. జగన్ 

October 2, 2020

‘Clap and shower accolades on volunteers at 7 p.m. on October 2’.

కరోనా సమయంలో జనతా కర్ఫ్యూ సందర్భంగా గిన్నెలు, గంటలు మోగించినట్టే ఏపీలో చప్పట్లు మోగనున్నాయి. ఈరోజు(శుక్రవారం) రాత్రి 7 గంటలకు రాష్ట్ర ప్రజలందరూ చప్పట్లు కొట్టండి అని ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు. గత ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను జగన్ ప్రారంభించారు. నేటితో ఈ వ్యవస్థకు ఏడాది పూర్తవుతోంది. ఈ సందర్భంగా గ్రామ స్వరాజ్యాన్ని సాధ్యం చేస్తున్నవారికి అభినందనలు చెప్పాలని అన్నారు. గిరిజనులకు పట్టాలు పంపిణీ చేసిన తర్వాత మాట్లాడిన సీఎం వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల్ని అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ప్రతి ఇంటికి వచ్చి మన తలుపు తట్టి ప్రజలకు ఏ సహాయం కావాలన్నా వివక్ష లేకుండా సహాయం చేస్తున్నారని.. లంచాలకు తావులేకుండా మంచి చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల సేవలు మరిచిపోలేనివి అన్నారు. ఈ వ్యవస్థలు స్థాపించి దాదాపు ఏడాది పూర్తవుతోందని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ స్వరాజ్యం అందరికీ కళ్ల ఎదుటే కనిపించే విధంగా వీళ్లందరూ కూడా సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. 

అందులో భాగంగానే ఈ రోజు రాత్రి 7 గంటలకు చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలని జగన్ వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ తన నివాసం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సీఎం కార్యాలయ అధికారులు వెల్లడించారు. కాగా, కరోనా సంక్షోభంలో వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులను అభినందించేందుకు ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టాలని జనతా కర్ఫ్యూ సమయంలో ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పిలుపుకు దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన లభించింది.