రాంచరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ..పెట్రోల్ పోసుకున్న అభిమాని - MicTv.in - Telugu News
mictv telugu

రాంచరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ..పెట్రోల్ పోసుకున్న అభిమాని

March 22, 2022

03

తెలుగు చిత్రసీమ పరిశ్రమతోపాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ పరిశ్రమల అభిమానులు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను వీక్షించడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రాంచరణ్, జూ. ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ భారీగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కోదాడలో రాంచరణ్ ఫ్యాన్స్ మధ్య జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ జరిగిన సంఘటన కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. కోదాడలోని ఓ థియేటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తారక్, చరణ్ అభిమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తారక్ అభిమానులు ఫ్లెక్సీ కడుతుండగా, రాంచరణ్ అభిమానులు అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణలో తీవ్ర మనోవేదనకు గురైన ఎన్టీఆర్ అభిమాని ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే, పక్కన ఉన్నవారు వెంటనే అతన్ని అడ్డుకున్నారు. దీంతో, పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన థియేటర్ వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇద్దరు హీరోలకు చెందిన అభిమానులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

మరోపక్క ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది. దీంతో భారీ అంచనాలు పెరిగాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరింత సందడిగా మారింది. అభిమానుల్లో అంతులేని కోలాహలం నెలకొంది. థియేటర్ల వద్ద అప్పుడే పెద్ద సందడి నెలకొంది. ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయడంలో తారక్, చరణ్ అభిమానులు తలమునకలై ఉన్నారు.