అవంతిక తండ్రికి క్లీన్‌చిట్.. హేమంత్‌ను చంపించిది మేనమామే! - MicTv.in - Telugu News
mictv telugu

అవంతిక తండ్రికి క్లీన్‌చిట్.. హేమంత్‌ను చంపించిది మేనమామే!

September 25, 2020

nvhmgh

నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు మాదిరే హేమంత్ హత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు. అయితే ఆ హత్యలో కన్నతండ్రి విలన్ అయితే ఈ పరువు హత్యలో అవంతిక మేనమామ విలన్ అయ్యాడు. ప్రేమ వివాహం ఇష్టంలేని అవంతిక తండ్రి కొంతమంది వ్యక్తులకు సుపారీ ఇచ్చి హత్య చేయించారనే ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని పోలీసులు వెల్లడించారు. హేమంత్ హత్యలో అవంతిక కుటుంబ సభ్యులే కీలక పాత్ర పోషించారని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు మీడియా ముందు తెలిపారు. కిరాయి గుండాలతో హేమంత్‌ను మేనమామ యుగంధర్ రెడ్డి హత్య చేయించాడని చెప్పారు. రూ.10 లక్షలు కిరాయి గూండాలకు ముట్టజెప్పి ఈ దారుణానికి ఒడిగట్టాడని తేల్చారు. చందానగర్‌కు చెందిన ఇద్దరు కిరాయి గుండాలతో హత్య చేయించినట్లుగా పోలీసులు గుర్తించారు.

నగరంలో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనను చేధించడానికి రంగంలోకి దిగిన పోలీసులు యుగంధర్‌తో పాటు మరో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిందితుల్లో అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మేనమామ యుగంధర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, రాకేష్ రెడ్డి, విజేందర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, రజిత, స్పందన, స్వప్న, అర్చనలపై పోలీసులు కేసులు నమోదుచేశారు. ఈ హత్యకు ముందు వారిని కిడ్నాప్ చేసిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కిడ్నాప్‌కు సంబంధించి మరిన్ని వివరాలు బయటపడ్డాయి.

హత్య చేశారిలా.. 

జూన్‌లో హేమంత్, అవంతిక ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో చందానగర్‌లో ఇరు కుటుంబాలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈనెల 20న అవంతిక మేనమామ యుగేంధర్ రెడ్డి హత్యకు కుట్ర చేశాడు. ముగ్గురు కిరాయి హంతకుల (ఎరుకల కృష్ణ, బిచ్చు యాదవ్, బాషా)కు  రూ.10లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. లక్ష రూపాయిలు అడ్వాన్స్‌గా కూడా ముట్టజెప్పారు. మూడు కార్లలో నిందితులు హేమంత్ నివాసానికి వెళ్ళారు. బలవంతంగా ఇద్దర్నీ 3:30 గంటలకు లాక్కెళ్లారు. 4:30 గంటల సమయంలో గోపనిపల్లిలో కారు మార్చి హేమంత్‌ను మరో కారులో తరలించారు. అదే సమయంలో 100 కాల్‌తో పోలీసులు స్పాట్‌కు చేరుకుని అందరిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. యుగెంధర్ రెడ్డి ఫోన్ స్విచాఫ్ చేసి కిరాయి హంతకులతో హేమంత్‌ను తరలించారు. ఔటర్ రింగురోడ్డు మీదుగా జహీరాబాద్‌లో మద్యం, తాడు కొనుగోలు చేశారు. ఓచోట హేమంత్ మూత్రానికి దిగాడు. మూత్రం పోస్తున్న అతన్ని వెనకనుంచి గట్టిగా పట్టుకుని కాళ్లు, చేతులు ఆ హంతకులు కట్టేశారు. అనంతరం తాడుతో గొంతుకు బిగేసి కారులోనే హత్య చేశారు. ఆ తర్వాత సంగారెడ్డిలో మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేశారు. మరో ఇద్దరితో కలిసి నిందితులు పటాన్ చెరు చేరుకుని మద్యం సేవించారు. అక్కడినుంచి సంతోష్ రెడ్డికి ఫోన్ చేశారు. అప్పటికే పోలీసుల అదుపులో సంతోష్ రెడ్డి ఫోన్ సిగ్నల్ ఆధారంగా యుగెంధర్ రెడ్డిని గుర్తించామని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.