ఇకపై పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేయడం, పాటలు పాడటం, బాణసంచా కాల్చడం వంటి అల్లరి పనులు చేయకూడదని ముస్లిం మత పెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వివాహమనేది శుభప్రదంగా జరగాల్సిన ఓ కార్యక్రమమని, ఆ వేడుకను అంతే పవిత్రంగా భావించాలన్నారు. తమ మాట కాదని ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘిస్తే భారీ జరిమానా తప్పదని హెచ్చరించారు. వచ్చే నెల డిసెంబర్ 2 నుంచే ఈ ఆదేశాలు అమలవుతాయని తెలిపారు.
జార్ఖండ్ బ్లాక్‌లోని ముస్లిం మతాధికారులు.. ఇకపై తమ మత వివాహాల్లో నృత్యం చేయడం, పాటలు పాడటం,బాణసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆదేశాలు డిసెంబర్ 2వతేదీ నుంచి అమలు చేస్తామని నిర్సా బ్లాక్‌లోని సిబిలిబడి జామా మసీదు హెడ్ ఇమామ్ మౌలానా మసూద్ అక్తర్ తెలిపారు.‘‘వివాహాల సందర్భంగా నృత్యం చేయడం, డీజే సంగీతం పెట్టడం బాణసంచా ప్రదర్శనలపై ఏకగ్రీవంగా నిషేధం విధించాం.ఈ ఆర్డర్‌ను ఉల్లంఘించిన వారికి రూ.5,100 జరిమానా విధిస్తాం’’ అని అక్తర్ తెలిపారు.
అంతేకాకుండా రాత్రి 11 గంటలలోపు వివాహం జరిపించాలని అక్తర్ సూచించారు. ‘‘రాత్రి 11 గంటల తర్వాత ఎవరైనా నికాహ్ చేయడానికి ప్రయత్నిస్తే వారికి కూడా జరిమానా కూడా విధిస్తాం, నిబంధనలను ఉల్లంఘించిన వారు రాతపూర్వకంగా క్షమాపణలు కూడా చెప్పాల్సి ఉంటుంది’’ అని అక్తర్ వివరించారు.