ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఝార్ఖండ్‌లోని పాలము జిల్లా సర్క్యూట్ హౌస్‌లో లాలూ బస చేసిన గదిలో మంటలు చెలరేగాయి. సిబ్బంది అప్రమత్తమై వెంటనే మంటల్ని ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. మేదినీనగర్‌లో బస చేస్తోన్న లాలూ.. ఈ ఉదయం తన గదిలో అల్పాహారం తింటుండగా ఫ్యాన్‌కు మంటలు అంటుకున్నాయి. దీంతో లాలూ సహాయకులు, ఇతర సిబ్బంది మంటలను ఆర్పివేశారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని పాలము జిల్లా డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదన్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్ 13 ఏళ్ల క్రితం ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే కేసుకు సంబంధించి బుధవారంనాడు ప్రత్యేక కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది. ఇందుకోసం ఆయన పాలము జిల్లా ప్రధాన కార్యాలయమైన మేదినినగర్కు సోమవారంనాడు వచ్చారు.