మా కోర్టును మూసేయండి.. ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు  - MicTv.in - Telugu News
mictv telugu

మా కోర్టును మూసేయండి.. ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు 

October 2, 2020

Close our court .. AP High Court comments

ఏపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యకలాపాలకు హైకోర్టు అడ్డు చెబుతోంది అని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా హైకోర్టు మీద అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారు. వీటి మీద న్యాయస్థానం స్పందించింది. హైకోర్టును అపకీర్తి పాలు చేస్తున్నారని.. న్యాయవ్యవస్థపై నమ్మకం లేకుంటే ఏపీ హైకోర్టును మూసివేయాలని పార్లమెంటులో కోరాలని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో సీఐడీకి ఫిర్యాదు చేసినా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదంటూ హైకోర్టులో అప్పటి రిజస్ట్రార్ జనరల్ వ్యాజ్యం దాఖలు చేశారు. గురువారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా ధర్మాసనం స్పందించింది. లాయర్లను అనవసరంగా ఎవరూ ధూషించరు.. వారి వెనకాల ఉండి ఎవరు కుట్ర చేస్తున్నది త్వరలోనే తేల్చుతాం అని హెచ్చరించింది. 

న్యాయమూర్తులపై ఆరోపణల నేపథ్యంలో స్వయంగా హైకోర్టే వ్యాజ్యం దాఖలు చేయాల్సి వచ్చిందని వెల్లడించింది. కోర్టులు, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పెట్టే పోస్టింగులను అనుమతించవద్దని సోషల్ మీడియా తరపున హాజరైన సీనియర్ న్యాయవాదులకు జస్టిస్ జె.ఉమాదేవి, జస్టిస్ రాకేశ్ కుమార్తో కూడిన ధర్మాసనం సూచించింది. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన, రూల్ ఆఫ్ లా అమలు కాని పక్షంలో తమకున్న ఇతర నిబంధనల ప్రకారం ముందుకు వెళ్తామని చెప్పింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులను తాము చూడలేదని కోర్టు ఆవేదన వ్యక్తంచేసింది. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను కాపాడేందుకు తమ వంతు సహకారం అందిస్తామని సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, సజన్ పూవయ్యలు  అన్నారు. కాగా, సీఐడీ దాఖలు చేసిన అదనపు అఫిడవిట్‌ను పరిశీలించే నిమిత్తం విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది.