హెచ్చరికలతో.. ఔరంగజేబ్ సమాధి మూసివేత - MicTv.in - Telugu News
mictv telugu

హెచ్చరికలతో.. ఔరంగజేబ్ సమాధి మూసివేత

May 19, 2022

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా ఖుల్తాబాద్ ప్రాంతంలో ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని పురావస్తు శాఖ అధికారులు ఐదు రోజుల పాటు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. దీనికి కారణం ఏంటంటే.. ఇటీవల ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఈ సమాధిని దర్శించుకున్నారు. దాంతో బీజేపీ, శివసేనలు ఆయనపై తీవ్ర విమర్శలు చేశాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా ప్రశాంతంగా ఉన్న మహారాష్ట్రలో కొత్త వివాదాలు సృష్టిస్తున్నారని అక్బరుద్దీన్‌పై మండిపడ్డారు.

తర్వాత మహారాష్ట్ర నవ నిర్మాణసేన అధికార ప్రతినిధి ట్వీట్ చేస్తూ ‘మహారాష్ట్రలో ఔరంగజేబ్ సమాధి ఉండాల్సిన అవసరం ఏముంది? వెంటనే దానిని ధ్వంసం చేయాల’ని అభిప్రాయపడ్డారు. దీంతో అప్రమత్తమైన మసీదు కమిటీ సమాధి ఉన్న ప్రాంతాన్ని తాళం వేయడానికి ప్రయత్నించింది. అయితే సమాధి ప్రాంతం ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ ఆధీనంలో ఉండడంతో మసీదు కమిటీ ప్రయత్నాన్ని వారు అడ్డుకున్నారు. అనంతరం సమాధిని ఐదు రోజుల పాటు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. తర్వాత దానిని పొడగించాలా? వద్దా? అనేది తర్వాత నిర్ణయిస్తామని వెల్లడించారు. అంతేకాక, సమాధి వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.