యావత్ దేశాన్ని కదిలించిన ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ దళిత యువతి హత్యాచారం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) అధికారుల బృందం దూకుడు పెంచింది. సంఘటన జరిగిన గ్రామంలో ఆఫీస్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గురువారం నలుగురు నిందితుల కుటుంబ సభ్యుల్ని అధికారులు విచారించారు. అంతకుముందు బాధితురాలి కుటుంబసభ్యుల్ని పలు మార్లు విచారించారు. తాజాగా నిందితుల ఇళ్లలో సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు.
ఈ నేపథ్యంలో నిందితుడు లవ్‌కుశ్ సికార్వర్ ఇంట్లో రక్తపు మరకలున్న బట్టల్ని సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ వార్తల్ని నిందితుడి కుటుంబసభ్యులు ఖండించారు. దీని గురించి నిందితుడి సోదరుడు రవి ఓ వీడియో మెస్సేజ్‌ను విడుదల చేశాడు. తానూ ఓ ఫ్యాక్టరీలో పెయింటర్‌గా పని చేస్తున్నానని, అందుకే తన బట్టలు ఎర్ర పెయింట్‌తో మాసిపోయి ఉన్నాయని తెలిపారు. అది ఎర్ర రంగు మాత్రమేనని సీబీఐ అధికారులు భావిస్తున్నారని తెలిపారు. అయితే దీనిపై సీబీఐ అధికారులు స్పందించాల్సి ఉంది.