
గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న బాలుడికి సీఎం కేసీఆర్ అండ
ఆపరేషన్ చేయించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు ఆదేశం
గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఏడేండ్ల బాలుడికి సీఎం కే చంద్రశేఖర్‌రావు అండగా నిలిచారు. బాలుడు పడుతున్న ఇబ్బందిపై గతనెల 29న నమస్తే తెలంగాణ సిద్దిపేట జిల్లా టాబ్లాయిడ్లో ప్రచురితమైన చిన్నోడి గుండెకు పెద్ద కష్టం కథనానికి సీఎం స్పందించారు. బాధితుడికి వెంటనే గుండె మార్పిడి చేయించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డిని ఆదేశించారు. కలెక్టర్ స్పం దించి డీఎంహెచ్‌వో, తహసీల్దార్‌ను బాధితుడి ఇంటికి పంపించి పూర్తి వివరాలు సేకరించారు. చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన బోకూ రి లావణ్య, బాల్‌రెడ్డి దంపతుల కుమారుడు లిఖిత్‌రెడ్డి(7) శ్వాస, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. కేర్ దవాఖానలో పరీక్షలు నిర్వహించగా బాలుడి గుండెకు 4 రంధ్రాలు ఉన్నాయని గుర్తించారు. చిన్న వయసు కావడంతో ఆపరేషన్ చేయడం కుదురదని చెప్పారు. రెం డేండ్లు మందులు వాడినా ఫలి తం లేకపోవడంతో యశోద దవాఖానకు తీసుకెళ్లారు. వారు నిపుణులతో సంప్రదించిన తర్వాత ఆపరేషన్ చేసేందుకు ముందుకొచ్చారు. ఇందుకు రూ.60 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అంత స్థోమత లేకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు తీవ్ర మనోవేధనకు గురై ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ విషయాన్ని మూడు రోజుల కిందట నమస్తే తెలంగాణ వెలుగులోకి తీసుకొచ్చింది. బాలుడి పరిస్థితిని చూసి సీఎం కేసీఆర్ చలించిపోయారు. బాలుడికి వైద్య సేవలు అందించాల్సిన బాధ్యతను సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డికి అప్పగించారు. దీంతో యశోద, కేర్ దవాఖానల వైద్య నిపుణులతో, వైద్యారోగ్యశాఖ సమన్వయంతో బాలుడికి గుండె మార్పిడి, ఇతరత్రా శస్త్రచికిత్సలు, వైద్య పరీక్షలు చేయించాలని కలెక్టర్ సోమవారం డీఎంహెచ్‌వోకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలతో డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రవీణ్‌చందర్, చేర్యాల తహసీల్దార్ విజయసాగర్, ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్ కలిసి లిఖిత్‌రెడ్డి ఇంటికి వెళ్లి పూర్తి వివరాలు సేకరించారు. బాలుడికి వైద్య పరీక్షల అనంతరం నిపుణుల సూచన మేరకు గుండె ఆపరేషన్ కోసం ప్రభుత్వం తరఫున సాయం చేయనున్నట్టు వెల్లడించారు. డీహెచ్ఎంవో, తహసీల్దార్ మంగళవా రం లిఖిత్‌రెడ్డిని వైద్యపరీక్షల కోసం హైదరాబాద్‌లోని యశోద దవాఖానకు తీసుకెళ్లనున్నారు.