కడప స్టీల్ ప్లాంట్‌కు సీఎం జగన్ భూమిపూజ చేశారు. సున్నపురాళ్ళపల్లెలో జేఎస్‌డబ్ల్యూ సంస్థ స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి భూమిపూజ చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం స్టీల్ ప్లాంట్ నమూనాను పరిశీలించారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై అధికారులతో సమీక్షించారు. రూ.8,800 కోట్లతో స్టీల్ ప్లాంట్‌ను జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్ లిమిటెడ్ సంస్థ నిర్మించనుంది. ఇందుకోసం ప్రభుత్వం 3500 ఎకరాలను jsw సంస్థకులీజు ప్రాతిపదికన కేటాయించింది. తొలివిడతగా 3వేల 300 కోట్లతో 10 లక్షల టన్నుల సామర్థ్యంతో ఉక్కు ఉత్పత్తి చేయనున్నారు. రెండో విడతలో మరో 20 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్‌ను విస్తరణ జరగనుంది. 36 నెలల్లో తొలి దశ యూనిట్ అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా నిర్మాణ పనులు జరుగుతాయి.
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి, దానికోసం శంకుస్థాపనలు చేస్తున్నారు. అయినా పనులు మాత్రం ప్రారంభం కావడం లేదు. మొదట్లో లిబర్టీ స్టీల్స్ కంపెనీ కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. అయితే అసలు పనులు ప్రారంభించక ముందే ఆ కంపెనీ దివాలా తీసింది. దాంతో ఎస్సార్ స్టీల్స్ ప్లాంట్ పెడుతుందని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఎందుకో ఆ సంస్థ కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు జేఎస్‌డబ్ల్యూ సంస్థ నిర్మిస్తున్నట్లుగా ప్రకటించారు. పరిశ్రమ స్థాపనకు 2007 జూన్ 10న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అనంతరం 2018 డిసెంబర్ 27న అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. వైసీపీ హయాంలో సీఎం జగన్ 2019, డిసెంబర్ 23న శంకుస్థాపన చేయగా మరోసారి నేడు భూమి పూజ చేశారు.