రేప్ చేసినందుకు చప్పట్లు కొట్టాలా? జగన్‌పై ఫైర్  - MicTv.in - Telugu News
mictv telugu

రేప్ చేసినందుకు చప్పట్లు కొట్టాలా? జగన్‌పై ఫైర్ 

October 2, 2020

CM Jagan, Claps, Volunteers, TDP MLA, Bandaru Satyanarayana Murthy, Angry.

‘వాలంటీర్ల వసూళ్లు.. కృష్ణాజిల్లాలో రెచ్చిపోయిన కంచికచర్ల గ్రామ వాలంటీర్లు.. అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడ్డ వాలంటీర్.. కర్ణాటకలో రెచ్చిపోయిన ఏపీ వాలంటీర్లు..,’ అని వివిధ వార్తా పత్రికలలో వచ్చిన క్లిప్పింగ్స్ జనతచేసిన వీడియోను టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి సోషల్ మీడియాలో పంచుకున్నారు. గ్రామ వాలంటీర్ల సేవలను గౌరవిస్తూ ఈరోజు(శుక్రవారం) సాయంత్రం 7 గంటలకు అందరం ఇంటి నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొడదామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో పలు సందర్భాలలో వివిధ వార్తా పత్రికలలో వచ్చిన పేపర్ కటింగ్‌లను జతచేసిన వీడియోను పోస్ట్ చేశారు. బాలికపై అత్యాచారం చేసిన వాలంటీర్‌కి చప్పట్లు కొట్టాలా? వృద్ధురాలి మెడలో గొలుసు కొట్టేసిన వాలంటీర్‌కి సత్కారం చెయ్యాలా? నాటు సారా కాసిన వాలంటీర్‌ని అభినందించాలా? అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడిన వాలంటీర్‌కి సన్మానం చెయ్యాలా? అని పేర్కొన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి జగన్‌గారూ అని ట్విటర్‌లో ఫైర్ అయ్యారు. కాగా, గత ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను జగన్ ప్రారంభించారు. నేటితో ఈ వ్యవస్థకు ఏడాది పూర్తవుతోంది. ఈ సందర్భంగా గ్రామ స్వరాజ్యాన్ని సాధ్యం చేస్తున్నవారికి అభినందనలు చెప్పేందుకు చప్పట్లు కొట్టాలని వెల్లడించిన విషయం తెలిసిందే.