సీఎం జగన్ మాకు ఏ హామీ ఇవ్వలేదు.. అసంతృప్త ఎమ్మెల్యేలు - MicTv.in - Telugu News
mictv telugu

సీఎం జగన్ మాకు ఏ హామీ ఇవ్వలేదు.. అసంతృప్త ఎమ్మెల్యేలు

April 12, 2022

ngfn

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తమకు ఖచ్చితంగా స్థానం దొరుకుతుందన్న ఆశలు పెట్టుకొని నిరాశకు గురైన వైసీపీ ఎమ్మెల్యేలను సీఎం జగన్ బుజ్జగిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం సామినేని ఉదయభాను, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్థసారథిలతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం మొదటగా ఉదయభాను మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు అనంతరం మంత్రి పదవి వస్తుందని ఆశించాను. రాకపోవడంతో బాధపడ్డా. అయితే పార్టీ ముఖ్యమని, తర్వాత ఎన్నికల్లో వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని చెప్పారు’ అని వ్యాఖ్యానించారు. అదే క్రమంలో జనసేనపై విమర్శలు గుప్పించారు. జనసేన ఓ షేరింగ్ పార్టీ అని, పవన్ కల్యాణ్ పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని స్పష్టం చేశారు. పార్థసారథి మాట్లాడుతూ తనకు మంత్రి పదవి రాకపోవడంతో తన మద్ధతుదారులు బాధపడ్డారని వెల్లడించారు. వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చామని సీఎం జగన్ చెప్పినట్టు వివరించారు. పిన్నెల్లి మాట్లాడుతూ.. ‘జగన్ బీఫామ్ ఇవ్వడం వల్లే నేను ఎన్నికల్లో గెలిచాను. ప్రస్తుతం ఆయన నుంచి ఎలాంటి హామీ రాలేదు. నేనూ ఏమీ అడగలేదు. మంత్రి పదవి ఎందుకు సాధ్యపడలేదో వివరంగా చెప్పారు. జగన్ ఏ పని చేసినా పార్టీ మేలు కోసమే చేస్తారు. తదుపరి టార్గెట్ 2024 ఎన్నికలు అని మాకు దిశానిర్దేశం చేశారు’అని వెల్లడించారు.