ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం 50వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఆయన కంటే ఆయన పుట్టినరోజును అభిమానులు మరింత ఘనంగా జరిపి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదానం కార్యక్రమాలు గిన్నీస్ బుక్ లో నమోదయ్యాయి. పెద్ద ఎత్తున జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 1 లక్షా 29 వేల 451 మంది రక్తదానం చేసి దక్షిణాఫ్రికా పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టారు. దీనికి సంబంధించిన సర్టిఫికెట్ ను గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రభుత్వ సలహాదారు సజ్జలకు అందజేశారు. దీంతో పాటు రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద సామూహిక రక్తదానంగా నిలిచింది. అలాగే ఇందుకోసం ఆవిష్కరించిన వెబ్ సైట్లో వారంతా రిజిస్ట్రేషన్ చేసుకోగా, దీంతో కూడా ప్రపంచ రికార్డు సాధించారు. ఈ రిజిస్ట్రేషన్లు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలలోనూ నమోదయ్యాయి. దేశవిదేశాల్లోని జగన్ అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఆస్ట్రేలియాలో జగన్ అభిమానులు రక్తదానంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.