పేదలకు జగన్ శుభవార్త.. ఇళ్ల బకాయిలు చెల్లించాలని.. - Telugu News - Mic tv
mictv telugu

పేదలకు జగన్ శుభవార్త.. ఇళ్ల బకాయిలు చెల్లించాలని..

June 2, 2020

CM Jagan goodnews of poor people .. To pay the dues of the house ...jp

ఏపీలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో శుభవార్త చెప్పారు. గత ప్రభుత్వం పేదలకు పెట్టిన ఇళ్ల బకాయిలను చెల్లించాలని జగన్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 3,38,144 ఇళ్లకు గానూ రూ.1,323 కోట్లు చెల్లించాలని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయంలో పేదలకు ఇళ్ల బకాయిలపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం బకాయిపెట్టినా.. పేదలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా జగన్ అన్నారు. పొరపాట్లకు తావివ్వకుండా ఈ చెల్లింపులు చేయాలని.. నిధులు సమీకరించుకుని చెల్లింపుల తేదీ ప్రకటించాలని అధికారులను ఆదేశించారు. మొదటి విడతలో చేపట్టబోయే 15 లక్షల నిర్మాణంపై సీఎం సమీక్ష నిర్వహించారు. నెల్లూరు, వైజాగ్, కర్నూల్ జిల్లాల్లో మొదటి దశలో చేపట్టబోయే ఇళ్ల సంఖ్యను పెంచేలా చూడాలని ఆయన ఆదేశించారు. మరోవైపు నిర్దేశిత డిజైన్‌లో భాగంగా పేదలకు నిర్మించబోయే ఇళ్లలో అందిస్తున్న సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

డిజైన్‌లో భాగంగా బెడ్‌ రూం, కిచెన్, లివింగ్‌ రూం, టాయిలెట్, వరండా సహా సదుపాయాలు ఉండేలా చూస్తున్నామని చెప్పారు. ఇంటి నిర్మాణంలో అన్ని రకాల జాగ్రత్తలు, నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ‘పేదవాడిపై ఒక్క రూపాయి అప్పు అనేది లేకుండా ఇంటిని అందించాలి. పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న సదుద్దేశంతో ఈ భారీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అత్యంత పారదర్శకంగా, నాణ్యతతో ఈ కార్యక్రమం కొనసాగాలి. పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడాలి. ప్రభుత్వం అంటే నాసిరకం అనే పేరుపోయి, ప్రభుత్వం చేస్తే నాణ్యతతో పనిచేస్తుందనే పేరు రావాలి. పేదలకోసం చేస్తున్న ఈ కార్యక్రమంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే పుణ్యం దక్కుతుంది’ అని జగన్ తెలిపారు. ఇదిలావుండగా వైయస్సార్‌ పుట్టినరోజు సందర్భంగా జులై 8న పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తామని జగన్ వెల్లడించారు. భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని అధికారులుకు సూచించారు. వారి కేటాయించిన స్థలం వద్దే అక్కా చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇవ్వనున్నట్టు జగన్ తెలిపారు.