గప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సోమవారం క్యాంప్ ఆఫీసులో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వహణలో వెనుకబడ్డ 20 మంది ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మెరుగుపరుచుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమనే సంకేతాన్ని పంపారు. తర్వాతి రివ్యూ మీటింగ్ నాటికి 20 మంది పుంజుకోవాలని ఆదేశించారు. ప్రతీ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపాలని సూచించారు.
అలాగే జగనన్నే మా భవిష్యత్తు నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా గృహసారథులు పని చేయాలని దిశానిర్దేశం చేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వచ్చే ఎన్నికల్లో ప్రతీ ఎమ్మెల్యే గెలవాలని ఆకాంక్షించారు. ఎన్నికల కోడ్ ఉన్న జిల్లాలను వదిలేసి మిగతా జిల్లాల్లో గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి గల తేడాను వివరించాలన్నారు. ఫిబ్రవరి 16లోగా మిగిలిపోయిన చోట్ల గృహసారథులను నియమించాలని, వారికి మండలాల వారీగా ఇచ్చే శిక్షణా కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యే పాల్గొనాలని తెలిపారు. జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల పరిశీలకులు అంతా కలిసికట్టుగా పని చేయాలని సూచించారు.