ఏపీలోని వాలంటీర్లకు శుభవార్త తెలిపారు వైసీపీ ప్రభుత్వంలోని ఓ మంత్రి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి రాగానే వాలంటీర్లకు రూ.15వేల జీతం ఇచ్చేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారన్నారు మంత్రి విశ్వరూప్. డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరంలో గ్రామ వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లతో సమావేశం నిర్వహించిన మంత్రి విశ్వరూప్.. రాష్ట్రంలో మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేలా వాలంటీర్లంతా కృషిచేయాలని సూచించారు. వేరే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. వాలంటీర్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తుందని, కాబట్టి వైసీపీ గెలువుకై అంతా కష్టపడి పనిచేయాలని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం.. రాష్ట్ర సంక్షేమ ఫలాలు పొందని లబ్ధిదారులను ఆరు నెలలకు ఒకసారి గుర్తిస్తూ.. వారికి పథకాలు అందించేలా చిత్తశుద్ధి చాటుతోందన్నారు మంత్రి. నియోజకవర్గ పరిధిలో 1200 మందికి నూతనంగా పింఛన్లు మంజూరు చేశామని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పింఛను ఇస్తోందని గుర్తు చేశారు.
పింఛన్లు తొలగింపు అనేది దుష్ప్రచారమేనని.. ఎవరూ నమ్మొద్దన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచుతూ వస్తున్నారన్నారు. సీఎం జగన్ త్వరలో వాలంటీర్లపై ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వారి పాత్రే కీలకం. దీంతో క్షేత్ర స్థాయిలో వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో త్వరలో సీఎం రిపోర్ట్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.