ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డిని ఎవరో చంపారో సీఎం జగన్‌కు తెలుసు అని డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ‘వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. త్వరలోనే బయటకు వెల్లడించే అవకాశం ఉంది. వివేకా హత్యకు సుపారీ ఎవరు ఇచ్చారు? ఎవరు హత్య చేయించారు? ఎవరు హత్య చేశారు అనే వివరాలు త్వరలోనే సీబీఐ బయట పెడుతుంది. ఎవరు చంపారో, చంపించింది ఎవరో జగన్‌కు బాగా తెలుసు. సీబీఐ ఎలాగూ కొద్దిరోజులకి చెబుతుంది. అందుకే జగన్ ఇప్పటికైనా అన్ని విషయాలు చెబితే మంచి పేరు వస్తుంది. వివేకానందరెడ్డి హత్య కేసులో తాడేపల్లి ప్యాలెస్‌ను కూడా విచారిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయి’ అని డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు.
వివేకా వెంట ఉంటూనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనను ఓడించేందుకు.. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుట్రలు చేశారని డీఎల్ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి కలిసి వివేకాను ఓడించారన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గంగిరెడ్డికి మొత్తం తెలుసని, సీబీఐకు అతడు అన్ని విషయాలు చెప్పాడని అన్నారు. వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు అవినీతిలో మునిగిపోయారని, జగన్‌రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి జోస్యం చెప్పారు.