ఏపీకి ప్రత్యేక హోదా ఎప్పుడంటే.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీకి ప్రత్యేక హోదా ఎప్పుడంటే.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

May 28, 2020

ఏపీ ప్రత్యేక హోదా అంశంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మా పాలన – మీ సూచన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మేథోమథన సదస్సులో ఏపీ ప్రత్యేక హోదా, పెట్టుబడులు వంటి అంశాలపై చర్చించారు. గత టీడీపీ ప్రభుత్వం హోదాను తీసుకురావడంలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ఇప్పటికే ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఎన్నో పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చేవని అభిప్రాయపడ్డారు. కానీ తాను గత పాలకుల్లా మాటలు చెప్పని.. ఏం చేయగలనో మాత్రమే చెబుతానని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రత్యేక హోదా అంశంపై కూడా క్లారిటీ ఇచ్చారు. 

‘ఈసారి కేంద్ర ప్రభుత్వం పూర్తి మెజార్టీతో అధికారంలో ఉంది. లేకపోతే హోదా వచ్చేది. అయినా హోదా కోసం అడగటం మాత్రం ఆపం. భవిష్యత్‌లో మాత్రం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ప్రాంతీయ పార్టీల అవసరం ఉంటుంది. అప్పుడు కచ్చితంగా సాధిస్తాం. ఇవాళ కాకపోయినా రేపైనా వచ్చి తీరుతుంది’ అంటూ జగన్ వ్యాఖ్యానించారు. ప్రజలను టీడీపీ ప్రభుత్వం గ్రాఫిక్స్‌ చూపించి మోసం చేసిందని ఆక్షేపించారు. ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో తొలి ర్యాంక్‌ అంటూ గొప్పగా చెప్పుకొని పెట్టుబడులు తేలేకపోయారని విమర్శించారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటే భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని జగన్ చెప్పారు.